NTR Death Anniversary: 'రాముడు’ సెంటిమెంట్‌ను కొనసాగించారు..
ABN , Publish Date - Jan 18 , 2025 | 08:45 AM
ఓ వెండితెర ధ్రువతారను 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసింది నందమూరి వెంకట్రావమ్మ. 1923 మే 28న ఆ నట శిఖరం నందమూరి లక్ష్మయ్య చౌదరి కళ్లెదుట మెరిసింది. ఆ మెరుపు నాలుగున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలింది.
అందానికి పోత పోస్తే ఎన్టీఆర్‌లా (NTR)ఉంటుంది. కళ్లకు మాటలు వస్తే అవి తారకరాముడు నేత్రాలై వికసిస్తాయి. స్వరానికి గాంభీర్యం జోడిస్తే అది రామారావు కంఠమై ప్రతిధ్వనిస్తుంది. నిబద్థతకు నిలువుటద్దం చేయిేస్త.. నందమూరి ప్రతిబింబమై కనిపిస్తుంది. వెండితెరపై నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా... తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన జ్ఞాపకాలు ఎన్నో. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానటుడిని గుర్తు చేసుకుందాం.. (Nandamuri Taraka Ramarao)
ఓ వెండితెర ధ్రువతారను 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసింది నందమూరి వెంకట్రావమ్మ. 1923 మే 28న ఆ నట శిఖరం నందమూరి లక్ష్మయ్య చౌదరి కళ్లెదుట మెరిసింది. ఆ మెరుపు నాలుగున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలింది. వెయ్యేళ్లకు సరిపడా వెలుగు పంచింది. ఆ వెలుగు పేరే నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమను ఆయన నడిపించి, గెలిపించారు. సహ నటుల భుజం తట్టారు. నిర్మాతగా మారి సినిమాకు వెన్నెముక య్యారు. కథకు దర్శకుడయ్యారు. ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు. వెండి తెరకు సార్వభౌముడయ్యారు. సినిమా చరిత్రకే కథానాయకుడయ్యాడు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. (NTR Death Anniversary)
ఒక హీరో పేరుతో సినిమా టైటిల్స్ రావడమనేది ఎన్టీఆర్‌తోనే మొదలైంది. నందమూరి తారక రాముడు నటించే సినిమాల టైటిళ్ల చివర 'రాముడు’ అనే పదం చేర్చడం 1954లో విడుదలైన 'అగ్గిరాముడు’ చిత్రంతో మొదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పేరు అగ్గిరాముడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి ప్రతిఘటించడం అతనికి అలవాటు. అగ్గిరాముడు పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతుంటాయి. రాబిన్‌హుడ్ తరహా పాత్ర ఇది. అందుకే సినిమా టైటిల్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని ఆలోచించి ఏమో అగ్గిరాముడు అనే టైటిల్ నిర్ణయించారు దర్శకుడు ఎం.ఎల్.శ్రీరాముల నాయుడు. ఆయన ఆలోచన ఎలా ఉన్నా ఈ సినిమా టైటిల్స్ పరంగా ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారని చెప్పాలి. రాముడు పేరుతో మరెన్నో చిత్రాలు రావడానికి అగ్గి రాముడు చిత్రం ప్రేరణగా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ హీరోగా శభాష్ రాముడు, బండ రాముడు, టాక్సీరాముడు, టైగర్ రాముడు, రాముని మించిన రాముడు, అడవిరాముడు, డ్రైవర్ రాముడు, శృంగారా రాముడు, సర్కస్ రాముడు, రౌడీరాముడు, కొంటె కృష్ణుడు, సరదా రాముడు, కలియుగ రాముడు వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఎక్కువశాతం హిట్ చిత్రాలే. అందుకే ఆ సెంటిమెంట్‌ను దర్శకనిర్మాతలు కొనసాగించారు.