Nithya Menen: ఆ అవార్డు దేవుడిచ్చిన లంచం.. నిత్యా ఇలా అనేసిందేంటి?
ABN , Publish Date - Jan 14 , 2025 | 08:56 PM
నిత్యామేనన్‌కు రీసెంట్‌గా జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు తనని సినిమాలకు దూరంగా వెళ్లకుండా ఆపడానికి దేవుడిచ్చిన లంచంగా నిత్యామేనన్ చెప్పుకొచ్చింది. తనకు మొదటి నుండి సినిమాల మీదగానీ, నటనపైగానీ ఇష్టం లేదని తెలిపిన ఆమె.. తనకు ఏదంటే ఇష్టమో కూడా చెప్పుకొచ్చింది. నిత్యామేనన్ ఏం చెప్పుకొచ్చిందంటే..
జాతీయ అవార్డు రావడం దేవుడు తనకు ఇచ్చిన లంచంగా భావించినట్టు హీరోయిన్ నిత్యామేనన్ చెప్పుకొచ్చారు. అలాగే, చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా స్థిరపడిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
‘‘చిన్న వయసు నుంచే కెమెరా ముందు నిల్చొని నటించాలంటూ మా అమ్మ ఒత్తిడి చేస్తుండేది. నిజం చెప్పాలంటే సినిమా నాకు అస్సలు నచ్చదు. ఇటీవల సినిమా నుంచి వైదొలగి మరేదైనా చేస్తానని నా తల్లిదండ్రులకు చెప్పగా, వారు నా ఇష్టానికే వదిలివేశారు. ఈ పరిస్థితుల్లో నాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇక సినిమా నన్ను వదిలిపెట్టదని, దేవుడు నాకు ఇచ్చిన లంచంగా భావించాను. బాల్యం నుంచే కెమెరా ముందు నిల్చోవడం నాకు ఇష్టం లేదు. సినిమా నటిగా మారినప్పటి నుంచి వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయాను. సహజత్వంతో కూడిన జీవితాన్ని అనుభవించలేదనే ఫీలింగ్ మనసులో ఏర్పడినపుడు అది పదేపదే డిస్ట్రబ్ చేస్తూనే ఉంది. నిజానికి ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్’ తరహా జీవితాన్ని గడపాలని ఆశపడ్డాను. ఫొటోలు తీయడమంటే అమితమైన ఇష్టం. కానీ, సినిమా పరిశ్రమకు దూరంకాలేని స్థితికి చేరుకున్నాను’’ అని నిత్యామేనన్ చెప్పుకొచ్చింది.
వాస్తవానికి కెరీర్ ప్రారంభించినప్పటి నుండి హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి నటిగా నిత్యామేనన్ నేమ్‌ని సొంతం చేసుకున్నారు. అలాగే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎన్నుకుంటూ ఆమె ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. నటిగా నిత్యామేనన్ అంటూ సినిమా పరిశ్రమలో అందరికీ ఎంతో గౌరవం. అలాంటి నటి.. సినిమా అంటేనే ఇష్టం లేదు, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయాను అంటుందీ అంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి. అందుకేనేమో ఈ మధ్య ఆమె సినిమాలు తగ్గించింది. ముందు ముందు మరింతగా ఆమె సినిమాలకు దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.