అప్పట్లో రజనీ.. ఇప్పుడు జూ.యన్టీఆర్ ..
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:21 PM
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రాలనే భావించేవారు విదేశీయులు. ఆ ముద్రను చెరిపేసి నేడు వరల్డ్ వైడ్ సౌత్ మూవీస్ అదరహో అనిపిస్తున్నాయి. వాటిలోనూ తెలుగు సినిమాలదే పైచేయి కావడం విశేషం.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రాలనే భావించేవారు విదేశీయులు. ఆ ముద్రను చెరిపేసి నేడు వరల్డ్ వైడ్ సౌత్ మూవీస్ అదరహో అనిపిస్తున్నాయి. వాటిలోనూ తెలుగు సినిమాలదే పైచేయి కావడం విశేషం. అందులో జూనియర్ యన్టీఆర్ (Jr.NTR) మూవీ 'దేవర' (Devara)కు జపాన్ (Japan) లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనడం చూస్తే... ముప్పై ఏళ్ళ క్రితం రజనీకాంత్ (Rajnikanth) గుర్తుకు వస్తున్నారని సినీజనం అంటున్నారు.
యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన 'దేవర' గత సంవత్సరం సెప్టెంబర్ 27న విడుదలై భలేగా సందడి చేసింది. ఈ మార్చి 28న 'దేవర'ను జపాన్ దేశంలో విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం జపాన్ వెళ్ళిన యంగ్ టైగర్ కు అక్కడ లభించిన అపూర్వ ఆదరణ ఇప్పటి దాకా ఏ ఇండియన్ స్టార్ కు దక్కలేదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. జపాన్ సినీఫ్యాన్స్ యంగ్ టైగర్ ను మొట్టమొదట 'ట్రిపుల్ ఆర్' (RRR)లో చూశారు. అందులో కొమురం భీమ్ పాత్రలో యన్టీఆర్ ప్రదర్శించిన నటన జపాన్ వారిని భలేగా ఆకట్టుకుంది. దాంతో కొంతమంది యన్టీఆర్ పై అభిమానంతో తెలుగు భాషను కూడా నేర్చుకున్నామని చెప్పడం ఎంతో విశేషంగా మారింది. ఓ జపాన్ యువతి తెలుగులో మాట్లాడుతూ యన్టీఆర్ తో ఆటోగ్రాఫ్ తీసుకొనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో జపాన్ లో యన్టీఆర్ కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. యన్టీఆర్ హవా చూస్తోంటే ముప్పై ఏళ్ళ క్రితం జపాన్ లో రజనీకాంత్ 'ముత్తు'కు లభించిన ఆదరణ గుర్తుకు వస్తోందని సినీఫ్యాన్స్ అంటున్నారు. అయితే అప్పటి కన్నా ఇప్పుడు సినీ ఫ్యాన్స్ సంఖ్య పెరగడం వల్ల యంగ్ టైగర్ కే ఎక్కువ ఫాలోయింగ్ కనిపించిందని చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీఫ్యాన్స్ కు, మేకర్స్ కు స్ఫూర్తినిచ్చిన సినిమా దిగ్గజం అకిరా కురోసావా జన్మించిన జపాన్ లో మన ఇండియన్ మూవీస్ సందడి చేయడం నిస్సందేహంగా అభినందనీయమే. 1996లో రజనీ 'ముత్తు'కు లభించిన క్రేజ్ మళ్ళీ 'త్రీ ఇడియట్స్', 'ధూమ్-3' సినిమాలతో ఆమిర్ ఖాన్ కు దొరికింది. ఆ పై రాజమౌళి 'బాహుబలి - ద కంక్లూజన్' మెరుపులు మెరిపించింది. తరువాత వచ్చిన రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సైతం జపాన్ లో బంపర్ హిట్ గా నిలచింది. అందువల్లే ఇప్పుడు 'దేవర' ప్రమోషన్స్ లో యంగ్ టైగర్ కు కనీవినీ ఎరుగని రీతిలో ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
'త్రీ ఇడియట్స్ ' సమయంలో ఆమిర్ ఖాన్ కు, 'బాహుబలి' టైమ్ లో రాజమౌళికి లభించిన ఆదరణ చూసి ఇండియన్స్ ఛాతీ విరుచుకున్నారు. ఇప్పుడు యన్టీఆర్ వంటి 'మేన్ ఆఫ్ మాసెస్' అంతకన్నా మిన్నగా జపనీయులకు దగ్గర కావడం తప్పకుండా ప్రతి భారతీయ సినీ అభిమాని పులకించి పోయే అంశమే! జపాన్ లో టాప్ గ్రాసర్ గా నిలచిన ఇండియన్ మూవీ 'ట్రిపుల్ ఆర్' (RRR).ఈ చిత్రం అక్కడ 2.42 బిలియన్ ఎన్స్ సంపాదించింది. అంటే మన కరెన్సీలో 137 కోట్ల రూపాయలన్న మాట! చిత్రమేంటంటే రజనీ 'ముత్తు' (Muthu) ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. ఆ సినిమా 405 మిలియన్ల ఎన్స్ పోగేసింది. మన లెక్కలో దాదాపు 23 కోట్ల రూపాయలు. మూడో స్థానంలో 'బాహుబలి - ద కంక్లూజన్', నాలుగో స్థానంలో 'త్రీ ఇడియట్స్', ఐదో స్థానంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' నిలిచాయి. 'ద లంచ్ బాక్స్' ఆరో స్థానం సంపాదించగా, ఏడులో 'సాహో' ఉంది. 'మగధీర' ఎనిమిదో స్థానం సంపాదించగా, 'రోబో' తొమ్మిదిలోనూ, ఆ తరువాత 'ధూమ్-3' ఉన్నాయి. వీటిలో డైరెక్టర్ రాజమౌళి చిత్రాలు మూడు ఉండగా, హీరోల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్, ప్రభాస్ సోలోగా రెండేసి సినిమాలు కలిగి ఉన్నారు. 'ట్రిపుల్ ఆర్'ను కలుపుకుంటే రామ్ చరణ్ కు కూడా రెండు పిక్చర్స్ ఉన్నట్టే! ఒకవేళ 'దేవర' కూడా ఈ టాప్ టెన్ లో చోటు సంపాదిస్తే అప్పుడు యన్టీఆర్ కూడా 'ట్రిపుల్ ఆర్'తో కలుపుకొని రెండు చిత్రాలు దక్కించుకున్నట్టవుతుంది. ఏది ఏమైనా 'దేవర' కూడా జపాన్ లో భారీ ఓపెనింగ్స్ తో టాప్ టెన్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?