Photo Talk: ఈ ఫోటో వెనకున్న కథేంటో తెలుసా
ABN , Publish Date - Feb 22 , 2025 | 09:57 AM
ఒక ఫొటో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతుంది. మరచిపోయిన విషయాలను గుర్తు చేస్తుంది. సందర్భం ఏదైనా ఒక్క ఫొటో ఉంటే చాలు జీవిత కాలం ఓ మెమరీగా ఉండిపోతుంది.
ఒక ఫొటో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతుంది. మరచిపోయిన విషయాలను గుర్తు చేస్తుంది. సందర్భం ఏదైనా ఒక్క ఫొటో ఉంటే చాలు జీవిత కాలం ఓ మెమరీగా ఉండిపోతుంది. అప్పుడప్పుడూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అలాంటి జ్ఞాపకాలకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు మీకోసం..
మామలతో బన్నీ...
ప్రస్తుతం ఆల్ ఇండియాలో 'పుష్పరాజ్'గా జేజేలు అందుకుంటున్న అల్లు అర్జున్, ఒకప్పుడు పాలబుగ్గలతో ఇలా ఇద్దరు మామల చెంతన కూర్చున్నారు. అందులో బన్నీతో పాటు మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఉన్నారు. మరి 'మామలు' అన్న బహువచనం ఏంటంటారా!? బన్నీకి రియల్ లైఫ్ లో చిరంజీవి మేనమామ కాగా, ప్రకాశ్ రాజ్ రీల్ లైఫ్ లో పలు మార్లు అల్లు అర్జున్ కు మామగా నటించారు. అలా ఓ వేడుకలో రియల్ లైఫ్, రీల్ లైఫ్ మామలతో కలసి పాలు పంచుకున్నారు.
'పంచా'మృతం
రెండు దశాబ్దాల క్రితం తెలుగునాట యువతను కిర్రెక్కించే బాణీలు కట్టి పలువురు సంగీత దర్శకులు అలరించారు. అలాంటి వారిలో ఆర్పీపట్నాయక్, చక్రి, శ్రీ, దేవిశ్రీ ప్రసాద్, ఘంటాడి కృష్ణ కూడా ఉన్నారు. ఈ ఐదుగురు సంగీత దర్శకులు ఓ వేదికను పంచుకున్నారు. విశేషమేంటంటే - ఈ ఐదు మందిలో కొందరు కొన్నిసార్లు తెరపై తళుక్కుమన్నారు. అయితే వీరిలో పూర్తి స్థాయి నటునిగా సాగింది మాత్రం ఆర్పీ పట్నాయక్ అనే చెప్పాలి. ఆర్పీ ప్రధాన పాత్రలో రూపొందిన 'శ్రీను వాసంతి లక్ష్మి' సినిమా వేడుకలో ఈ ఐదుమంది సంగీత దర్శకులు పాల్గొన్నారు. తమ మిత్రుడు నటుడైనందుకు మిగిలిన వారి ముఖాల్లో ఆనందం తొంగిచూస్తోంది. మీరూ చూడండి!