Kumbh Mela Monalisa: ‘కుంభమేళా’ మోనాలిసా ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. రీల్స్ నుండి రియల్ తెరకు!
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:11 PM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా అనే యువతి ఇప్పుడు సెలబ్రిటీగా మారింది. ఆమె సహజ సౌందర్యానికి ఓ బాలీవుడ్ దర్శకుడు ఫిదా అవడమే కాకుండా.. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో ఉన్న ఆమె ఇంటికి సైతం వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటికే ఎన్నో కోట్ల మంది భక్తులు హాజరై, పుణ్యస్నానాలు ఆచరించారు. రోజురోజుకూ ఈ కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్పితే.. సంఖ్య అస్సలు తగ్గడం లేదు. అంతటి మహా విశిష్టత ఈ కుంభమేళాకు సంతరించుకుని ఉండటంతో.. తమ జన్మ ధన్యం చేసుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మహా కుంభమేళాలో తేనే కళ్లతో కనిపించిన ఓ యువతి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ యువతి మరెవరో కాదు.. మోనాలిసా. కొన్నిరోజులుగా ఈ పేరు ట్రెండ్‌ని బద్దలు కొడుతోంది. ఇప్పుడీ భామ ఇంటికి ఓ దర్శకుడు వెళ్లడంతో.. మరోసారి మోనాలిసా వార్తలలో నిలుస్తోంది. విషయం ఏమిటంటే..
Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌కు చెందిన మోనాలిసా అనే యువతి.. ఈ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది. కానీ ఆమె న్యాచురల్ బ్యూటీకి ఈ కుంభమేళాకు హాజరైన వారంతా ఫిదా అయ్యారు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సెల్ఫీలకు ఎగబడుతుండటంతో.. ట్రాఫిక్ జామ్‌లు అయినట్లుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను ఆ ప్రదేశం నుండి పంపించేసినట్లుగా తెలుస్తోంది. అయితేనేం, ఈ లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. బాలీవుడ్‌కి చెందిన ఓ డైరెక్టర్‌ను ఆమె బాగా ఆకర్షించింది. వెంటనే తన సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా సదరు డైరెక్టర్ పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియా వరకే పరిమితం అని అనుకున్నారు కానీ.. ఆ దర్శకుడు మాత్రం అది నిజం చేసి చూపించారు.
అవును.. మోనాలిసాకు ఆఫర్ ఇస్తానన్న బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా.. చెప్పినట్లుగానే ఆమెను వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ చేరుకున్నారు. మోనాలిసా ఇంటికి వెళ్లి.. తన సినిమాలో నటించమని అడగడమే కాకుండా.. ఆమె తల్లిదండ్రులను సైతం ఒప్పించారు. మొదట కాస్త ఆలోచించినా.. కొన్ని కండీషన్స్‌తో ఆమె తల్లిదండ్రులు ఓకే చెప్పినట్లుగా సమాచారం. సనోజ్ మిశ్రా ప్రస్తుతం చేయబోతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాకు అవకాశం ఇచ్చారు. ఆమెకు యాక్టింగ్ రాకపోయినా.. నేర్పించి మరీ ఈ సినిమాలో ఆమెతో నటింపజేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించి ఉన్నారు.
ఇప్పుడామెను నటిగా పరిచయం చేసేందుకు ఉన్న అడ్డంకులను సైతం ఆయన అధిగమించాడు. మోనాలిసా ఫ్యామిలీని కలిసి.. ఆమెతో యాక్టింగ్ చేయించడానికి ఒప్పించినట్లుగా తెలుపుతూ.. ఆమెతో దిగిన ఓ వీడియోను సనోజ్ మిశ్రా విడుదల చేశారు. ముంబైలో ఆమెకు ట్రైనింగ్ ఇప్పించబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ లోపు ఆమెకు ట్రైనింగ్ పూర్తి చేయిస్తానని సనోజ్ మిశ్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. (Kumbh Mela Monalisa)