Film Industry: శ్రీదేవి, కేదార్ మరణాలు దుబాయ్ లో ఫిబ్రవరిలోనే...
ABN , Publish Date - Mar 04 , 2025 | 10:39 AM
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో హఠాన్మరణం చెందింది. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత అదే ఫిబ్రవరి నెల 25న తెలుగు నిర్మాత కేదార్ దుర్మరణం పాలయ్యారు.
దుబాయ్ లో కన్నుమూసిన తెలుగు సినిమా నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) అంత్యక్రియలు మొత్తానికి పూర్తి అయ్యాయి. చిత్రం ఏమంటే... అందాల తార శ్రీదేవి (Sridevi) సైతం దుబాయ్ లోనే ఫిబ్రవరి 24వ తేదీ 2018లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. సరిగ్గా ఇది జరిగిన ఏడు సంవత్సరాలకు ఫిబ్రవరి 25న తెలుగు సినిమా నిర్మాత కేదార్ సెలగం శెట్టి అదే దుబాయ్ లో కన్నుమూశారు. ఈ రెండు మరణాలపై రకరకాల నీలినీడలు ఏర్పడ్డాయి. శ్రీదేవి 54 యేళ్ళ వయసులో కన్నుమూయగా, కేదార్ కేవలం 42 సంవత్సరాలకే తుది శ్వాస విడిచారు. అప్పట్లో శ్రీదేవి హఠాన్మరణంపై రకరకాల అనుమానులు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం తప్పితే... ఎలాంటి కుట్ర కోణం లేదని అక్కడి అధికారులు విచారణ అనంతరం తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా కేదార్ మరణంపై రకరకాల పుకార్లు షికారు చేసిన నేపథ్యంలో ఈయన మరణం వెనుక కూడా ఎలాంటి కుట్ర లేదని ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే శ్రీదేవి మృతదేహాన్ని మూడు రోజుల్లో కుటుంబ సభ్యులకు ఇచ్చిన అక్కడి అధికారులు... కేదార్ విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించారనే చెప్పాలి. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం కేదార్ కన్నుమూస్తే... వారం రోజుల తర్వాత మార్చి 3వ తేదీ ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు చేశారు.
ఇద్దరి మరణాలపైనా చర్చోపచర్చలు
శ్రీదేవి మరణించి ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమె భారతీయ సినీ ప్రేక్షకుల స్మృతిపథంలో ఉంటూనే ఉంది. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , ఖుషీ (Khushi Kapoor) ఇప్పుడిప్పుడే చిత్రసీమలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మరణం వెనుక మిస్టరీని ఎప్పటికైనా ఛేదించాలనే వాదన ప్రతి యేడాది ఆమె జయంతి, వర్థంతి సమయాల్లో వస్తూనే ఉంది. శ్రీదేవి పాటించిన కఠోర ఆహార నియమాలే ఆమె హఠాన్మరణానికి కారణమని స్వయంగా భర్త బోనీకపూర్ (Boney Kapoor) చెప్పారు.
సినీరాజకీయ వర్గాలు దూరం
కేదార్ విషయంలో అయితే బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. హైదరాబాద్ లో పబ్ ను నిర్వహించిన ఆయన ఆ తర్వాత డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో ఉన్న అనుబంధంతో చిత్ర నిర్మాతగా మారారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సుకుమార్ (Sukumar) కాంబోలో మూవీ నిర్మించాలనుకున్నా కుదరక పోవడంతో, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తో 'గం గం గణేశా' (Gam Gam Ganesha) మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత దుబాయ్ కేంద్రంగా వ్యాపారాన్ని మొదలు పెట్టారు. చివరకు అక్కడే అనుమానాస్పాద పరిస్థితిలో కన్నుమూశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలతోనూ సత్ సంబంధాలు ఉండటంతో చివరకు కేదార్ మృతి రాజకీయ రంగునూ పులుముకుంది. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఎవరైనా కోరితే విస్తృత స్థాయిలో విచారణ జరిపిస్తానని అన్నారు. కేదార్ కు సినీ, రాజకీయ రంగాలతో సంబంధాలు ఉన్నా... ఆయన అంత్యక్రియలకు వీరంతా దూరంగానే ఉన్నారు. ఏదేమేనా... ఏడేళ్ళ క్రితం శ్రీదేవి మరణం... ఇప్పుడు కేదార్ మృతి దుబాయ్ లో సంభవించడం, వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేయడం ఆలోచించాల్సిన విషయాలు.
Also Read: Pattudala: ఓటీటీలోనూ అజిత్ సినిమాకు అదే రిజల్ట్!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి