Jwala Gutta: ‘గుండెజారి గల్లంతయ్యిందే’.. ఇప్పుడు ఎందుకిలా..

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:57 PM

పుష్కరకాలం క్రితం జరిగిపోయిన విషయం గురించి బాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలా తాజాగా స్పందించారు. నితిన్‌ హీరోగా నటించిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో ఆమె ఓ పాటలో కనిపించి సందడి చేశారామె


పుష్కరకాలం క్రితం జరిగిపోయిన విషయం గురించి బాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలా (Gutta Jwala) తాజాగా స్పందించారు. నితిన్‌ (nithin) హీరోగా నటించిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’(Gunde jaari gallanthayyinde) చిత్రంలో ఆమె ఓ పాటలో కనిపించి సందడి చేశారామె. విజయ్‌కుమార్‌ కొండా (Vijay Kumar konda) దర్శకత్వం వహించారు. నితిన్‌తో ఉన్న స్నేహం కొద్దీ ఆమె స్పెషల్‌ సాంగ్‌ కోసం (Gutta Jwala Special song) వర్క్‌ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ పాట చేయడం గురించి వైరల్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ ‘‘నితిన్‌ నాకు మంచి స్నేహితుడు. ఓ సారి మేమంతా పార్టీలో ఉన్నప్పుడు తన సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఉందని, అందులో డ్యాన్స్‌ చేయమని అడిగాడు. ఆలోచించి ఓకే చెప్పా. దానిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత తను మళ్లీ నన్ను కలిశాడు. పాట ఫైనల్‌ చేశామని చెప్పాడు. నేను చేయలేనని చెప్పా. దానికి తను ఒప్పుకోలేదు. పట్టుబట్డాడు. తన కోసమే తప్పక అంగీకరించా. ఆ పాట వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందంటే.. అప్పటి వరకూ నితిన్‌ నటించిన చాలా సినిమాలు సరిగ్గా ఆడలేదు. నేను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సూపర్‌ సక్సెస్‌ అయింది. నేషనల్‌ మీడియాలో కూడా ఆర్టికల్స్‌ వచ్చాయి. ‘నీ వల్లే నా సినిమాకు నేషనల్‌ మీడియాలోనూ ప్రమోషన్స్‌ జరుగుతోంది’ అని నితిన్‌ అనేవాడు. నాలుగురోజుల పాటు షూట్‌ చేశాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది’’ అని నవ్వుతూ చెప్పారామె.


ఇంకా ఆమె చెబుతూ ‘‘నితిన్‌ సినిమాలో యాక్ట్‌ చేయడాని కంటే ముందు నాకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మన సినిమాల్లో యాక్ట్‌ చేయాలంటే అమ్మాయి తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తోన్న సమయంలో నాకు సినిమా అవకాశాలు, నో చెప్పడం కూడా జరిగింది. సినిమా అనేది నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇండస్ట్రీలో నాకెంతో మంది స్నేహితులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమైంది. నేను వారిలా ఉండలేను. సినిమాల్లో ఉండాలంటే ఎంతో మారాలి. సిగ్గు అనేది ఉండకూడదు. ఎన్నో విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. ఇప్పుడు నా భర్త నా సినిమాల్లోనే ఉన్నారు. 24 గంటలు వాళ్లకు ఏదో ఒక పని ఉంటుంది. డబ్బుల విషయంలో టెన్షన్స్‌ ఉంటాయి. కానీ మాకు అలా కాదు.. 10 గంటలు గేమ్‌ ప్రాక్టీస్‌ చేస్త్తే తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 04:57 PM