Imanvi: అసత్యాల ప్రచారం ఆపండి...
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:50 PM
ప్రభాస్ 'ఫౌజీ'లో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే తాను పాకిస్తానీ జాతీయురాలిని కాదని ఇమాన్వీ వివరణ ఇచ్చింది.
పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రభాస్ (Prabhas) 'ఫౌజీ' (Fauji) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వీ (Imanvi) జాతీయతపై సోషల్ మీడియాలోనూ, వార్తా సంస్థలలోనూ పలు వార్తలు ప్రసారం అయ్యాయి. ఆమె తండ్రి పాకిస్తాన్ ఆర్మీలో అధికారికగా పనిచేశారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) సంస్థ, హను రాఘవపూడి (Hanu Raghavapudi) తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఇమాన్వీ పాల్గొంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ కొత్త నటి ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. తన నేపథ్యం గురించి ఆమె గానీ, చిత్ర బృందంగానే తెలియ చేయక పోవడంతో మీడియా వర్గాలు గూగుల్ ను ఆశ్రయించాయి. అందులోని సమాచారాన్నే వారంతా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అందులో ఇమాన్వీ తండ్రి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అని ఉండటంతో తాజాగా జరిగిన దుర్గటనతో ఆ విషయాన్ని మరింతగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. పాకిస్తాన్ నటుడైన ఫవాద్ ఖాన్ పైనా బుధవారం నుండి ట్రోలింగ్ మొదలైంది. అలానే ఇమాన్వీ పాకిస్తానీ నటి అనే ప్రచారం జరగడంతో ఆమెను 'ఫౌజీ' చిత్రం నుండి తొలగించాలని లేదా ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలని కొందరు నెటిజన్స్ డిమాండ్ చేశారు.
ఈ ప్రచారం నడుమ గురువారం ఇమాన్వీ తన గురించి పూర్తి సమాచారాన్ని తెలియచేస్తూ వివరణ ఇచ్చింది. తనకు గానీ, తన తండ్రికి గాని పాకిస్తాన్ తో సంబంధమే లేదని తేల్చిచెప్పింది. తాను భారతీయ అమెరికన్ అని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రులు ఇక్కడ నుండి యుక్తవయసులోనే అమెరికా వెళ్ళారని, తాను అక్కడే జన్మించానని ఇమాన్వీ తెలిపింది. అమెరికాలో యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత తాను నటిగా, కొరియోగ్రాఫర్, నర్తకిగా రాణించే ప్రయత్నం చేశానని, అలాంటి తనకు చిత్రసీమలో అవకాశం రావడం ఆనందాన్ని కలిగించిందని ఇమాన్వీ ఆ ప్రకటనలో తెలిపింది. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడే భారతీయ అమెరికన్ గా తాను గర్విస్తానని చెప్పింది. తన రక్తంలో భారతీయ సంస్కృతి ఉందని, కానీ దానిని గుర్తించకుండా కొన్ని వార్తా సంస్థలు, సోషల్ మీడియా తాను పాకిస్తాన్ జాతీయురాలినని తప్పుడు ప్రచారం చేయడం బాధను కలిగించిందని వాపోయింది. కళ ద్వారా తాను మనుషులను కలపాలని అనుకుంటానని వివరణ ఇచ్చింది. ఇమాన్వి ఇచ్చిన ఈ వివరణతో ఆమెపై జరుగుతున్న అసత్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Also Read: Tollywood: వీకెండ్ పదకొండు తెలుగు సినిమాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి