Heroines: కొత్త రెజల్యూషన్స్‌.. ఇకపై ఇలాగే ఉంటాం 

ABN , Publish Date - Jan 26 , 2025 | 07:25 AM

సరికొత్త ‘రెజల్యూషన్స్‌’ (Actress New resolution) చేసుకోవడం సహజం. ‘అలాంటి తీర్మానాలు మాకు కూడా ఉన్నాయ’ంటున్నారు కొందరు అందాల తారలు. ఇంతకీ 2025లో వారి తీర్మానాలేమిటంటే...

కొత్త ఏడాదిలో... పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. నూతన లక్ష్యాల్ని నిర్దేశించుకొని ‘ఇలా చేయాలి... ఇవి సాధించాలి’ అంటూ సరికొత్త ‘రెజల్యూషన్స్‌’ (Actress New resolution) చేసుకోవడం సహజం. ‘అలాంటి తీర్మానాలు మాకు కూడా ఉన్నాయ’ంటున్నారు కొందరు అందాల తారలు. ఇంతకీ 2025లో వారి తీర్మానాలేమిటంటే...

నచ్చినవన్నీ తింటా...

ఈ ఏడాది న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం నేను, నా భర్త లండన్‌ వెళ్లాం. ఇన్నేళ్లలో ఎన్నో వెకేషన్లకు వెళ్లాను. వెళ్లిన ప్రతీ చోటా అక్కడి రుచుల్ని, నచ్చిన ఆహార పదార్థాల్ని మాత్రం మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయేదాన్ని. కారణం... ఎక్కడ బరువు పెరుగుతానోననే భయం. కానీ ఈసారి న్యూఇయర్‌ వెకేషన్‌లో మాత్రం నచ్చిన ఆహారాన్ని సంతృప్తిగా తిన్నా. అది నా మనసుకెంతో సంతోషాన్నిచ్చింది. నాలాగే ఆలోచించే అమ్మాయిలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మీ మనసులోని భయాలు, అపోహల్ని పక్కన పెట్టి, నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించండి. తిరిగి ఫిటెనెస్‌పై దృష్టి సారించండి. మనం ఎలా కనిపిస్తున్నామన్న దానికంటే మనం ఎంత సంతృప్తిగా, సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం. అందుకే ఈ ఏడాదిని పూర్తిగా ఆస్వాదించాలని గట్టిగా తీర్మానించుకున్నా.

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preeth Singh)

అమ్మానాన్నలతో గడుపుతా...

ప్రతీ ఏడాది కొన్ని తీర్మానాలు తప్పకుండా చేసుకుంటా. గత రెండు మూడేళ్లలో ధ్యానంపై శ్రద్ధ పెట్టా. అలాగే వీగన్‌గా మారాను. ఈ ఏడాది నా కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. నా తల్లిదండ్రులకు వయసు పెరుగుతోంది. ఈ సమయంలో నా అవసరం వాళ్లకి చాలా ఉంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ సమయం వాళ్లతో గడపాలని అనుకుంటున్నా.

- జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)

విమర్శల్ని పట్టించుకోను

సాధ్యాసాధ్యాలతో పని లేకుండా, శక్తికి మించి ఏవేవో పెద్ద పెద్ద లక్ష్యాల్ని పెట్టుకుంటారు చాలామంది. తీరా వాటిని చేరుకోలేక చతికిలపడతారు. కాబట్టి శక్తికి మించి ఆలోచించడం కరెక్ట్‌ కాదు. వంద శాతం చేయగలమనుకున్న పనుల్నే తీర్మానాలుగా తీసుకోవాలి. అప్పుడే వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను ఆస్వాదించగలుగుతాం. నేనైతే ఈ ఏడాదిలో విమర్శల్ని పట్టించుకోకుండా, పాజిటివిటీతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని, నా భర్తతో మరింత సమయం గడపాలని నిర్ణయించుకున్నా.

- కియారా అడ్వాణీ (Kiara adwani)

అభివృద్ధే లక్ష్యంగా...

చేసే పనిపై మరింత ఏకాగ్రత పెడుతూ... వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగానూ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందులో భాగంగా ఉత్సాహంగా, అందంగా ఉండడానికి మరింత ప్రాధాన్యమిస్తా. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా నమ్ముతాను. నాది వృశ్చికరాశి. దీని ప్రకారం ఈ ఏడాదంతా పాజిటివిటీతో హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండబోతున్నానట. ఆర్థికంగా కూడా బాగా కలిసొస్తుందని నా జాతకం చెబుతోంది. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు.

- మలైకా అరోరా(Malaika Arora)

ప్రపంచాన్ని చుట్టేస్తా...

చేతి నిండా సినిమాలతో గత కొన్నేళ్లుగా క్షణం తీరికలేకుండా గడిపా. అందుకే ఈ ఏడాది పూర్తిగా ట్రావెలింగ్‌ కోసం కేటాయించాలని తీర్మానించుకున్నా. సోలోగా ప్రపంచాన్ని చుట్టేద్దామని ఫిక్సయ్యా. వివిధ ప్రాంతాలు, దేశాలు తిరుగుతూ కొత్త కొత్త సంస్కృతులను తెలుసుకోవాలనుకుంటున్నా. అలాగే ఎన్ని పనులతో బిజీగా ఉన్నా రోజులో కొంతసమయం ప్రత్యేకంగా నాకోసం కేటాయించాలని అనుకుంటున్నా. ఇష్టమైన పనులు చేయడం, నచ్చినట్లుగా ఉండటం, మనసుకు నచ్చిన వారితో సమయం గడపడం వంటివి చేస్తా. దీనివల్ల పాజిటివిటీతో పాటు స్వీయ ప్రేమ కూడా పెరుగుతుందని నమ్ముతున్నా.

- దిశా పటానీ (Disha Patani)

Updated Date - Jan 26 , 2025 | 07:26 AM