King Nagarjuna: సీఎం రేవంత్ ఆదేశించారు.. కింగ్ నాగ్ పాటించారు
ABN , Publish Date - Jan 09 , 2025 | 07:05 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కింగ్ నాగార్జున పాటించారు. ఏం ఆదేశించారు.. ఏం పాటించారు? అని అనుకుంటున్నారా? రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి కింగ్ నాగార్జున కూడా హాజరయ్యారు. ఆ భేటీలో సీఎం రేవంత్ ఆదేశించిన పనిని కింగ్ నాగ్ ఓ బ్యూటీఫుల్ వీడియోతో పాటించారు. వివరాల్లోకి వెళితే..
సంధ్య థియేటర్ ఘటన తర్వాత కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ టూరిజంను సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలని.. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా.. ఆ భేటీ అనంతరం వార్తలు వచ్చాయి. సీఎంతో భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వాటిపై అవగాహన కల్పించేలా వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు వీడియోలు విడుదల చేయగా.. తాజాగా కింగ్ నాగార్జున వంతు వచ్చింది. కింగ్ నాగ్ ఏ టాపిక్ తీసుకున్నారంటే..
తెలంగాణలో ఉన్న టూరిజం వివరిస్తూ చక్కటి వీడియోని కింగ్ నాగ్ విడుదల చేశారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, టెంపుల్ టూరిజం, తెలంగాణ వంటకాలను కింగ్ నాగార్జున ఈ వీడియోలో ప్రదర్శిస్తూ వివరించారు. ఈ వీడియోలో ఆయన తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు, రుచి చూడాల్సిన వంటకాలు, దర్శించుకోవాల్సిన దేవాలయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించడం విశేషం. ఈ వీడియో చూసిన తెలంగాణ టూరిజం శాఖ శారు ఆశ్చర్యపోతూ.. అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. కింగ్ నాగ్ వదిలిన వీడియోలో..
‘‘చిన్నప్పటి నుంచి తెలంగాణలోని ఎన్నో అందమైన ప్రదేశాలు చూశాను. జోడేఘాట్ వ్యాలీ, ఆదిలాబాద్ దగ్గర ఉన్న మిట్టేరు వాటర్‌ఫాల్స్, బొగతా జలపాతం, వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి. రామప్ప ఆలయం. ఇది యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ కట్టడం. మీరంతా వచ్చి చూడాలి. చాలా అందంగా ఉంటుంది. యాదగిరి గుట్ట, నేను చాలా చాలా సార్లు వెళ్లాను. చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. వచ్చిన వాళ్లు యాదగిరిగుట్టను దర్శించుకోవడం మిస్ కావద్దు. తెలంగాణలోని ఫుడ్ విషయానికి వస్తే... తెలంగాణలో నాకు నచ్చిన ఫుడ్ ఏమిటంటే... జొన్న రొట్టేతో అంకాపూర్ చికెన్. స్నాక్స్‌లో చెప్పాలంటే సర్వపిండితో చేసే వంటకాలు చాలా ఇష్టం. ఇక మీకు తెలియంది ఏముంది. ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫేమస్ ఫుడ్. ఇవన్నీ మర్చిపోలేనివి. మీతో చెబుతుంటేనే నాకు నోటిలో నీళ్లు ఊరుతున్నాయి. తెలంగాణలో నాకు నచ్చింది ప్రజల ఆత్మీయత. ప్రతి ఒక్కర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు. ఏ భాష వాళ్లనైనా ప్రేమతో స్వాగతం పలుకుతారు. చాలా అందంగా ఉంటుంది. మీరంతా తప్పకుండా తెలంగాణ రండీ. వచ్చి ఎంజాయ్ చేయండి. జరూర్ ఆనా హమారా తెలంగాణ’’ అని కింగ్ నాగార్జున ఈ వీడియోలో తెలిపారు.