Balakrishna : బోయపాటితో చెడిందా!?
ABN , Publish Date - Apr 13 , 2025 | 02:13 PM
హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగో సినిమాకు శ్రీకారం చుట్టారు. వీరి కాంబోలో వస్తున్న 'అఖండ -2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే వీరి మధ్య విబేదాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటీ!?
క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయంటే బజ్ భలేగా ఉంటుంది. అలాగే ఆ కాంబోస్ నడుమ డిస్ప్యూట్స్ ఉన్నాయనీ వినిపించడమూ పరిపాటే. నటసింహ బాలకృష్ణ (Balakrishna) - డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబో గురించి చెప్పక్కర్లేదు. వారి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కుతోంది... ఈ నేపథ్యంలోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయని విశేషంగా వినిపిస్తోంది... ఎందుకలాగా!?
నటసింహ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో 'హ్యాట్రిక్' చూసేసింది. వారి మూడు సినిమాలు మూడు రకాల రికార్డ్స్ నమోదు చేశాయి. ఇక ఓ హీరో డ్యుయల్ రోల్స్ తో ఓ డైరెక్టర్ వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టడం ఆషామాషీ కాదు. ఆ రికార్డును బోయపాటి శ్రీను సొంతం చేసుకున్నారు. ఇక వారిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న నాల్గవ చిత్రం 'అఖండ -2' (Akhanda -2) పై అభిమానుల్లోనే కాదు చిత్రసీమలోనూ బోలెడు అంచనాలు నెలకొన్నాయి. అదీగాక బాలకృష్ణకు 'అఖండ-2' మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంఘీ విలేజ్ ఏరియాలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలకృష్ణ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే హీరో బాలయ్యకు, దర్శకుడు బోయపాటికి మధ్య విభేదాలు తలెత్తాయని విశేషంగా వినిపిస్తోంది. రెండు విషయాల్లో బాలయ్య, బోయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందువల్ల దర్శకుడు కూడా అంటీముట్టనట్టు షూటింగ్ జరుపుతున్నారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదనీ కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇవన్నీ గిట్టనివారు క్రియేట్ చేస్తున్న గాసిప్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
ప్రగ్యాను తప్పించడమే కారణమా!?
'నిప్పులేందే పొగరాదు కదా...' అంటూ కొందరు సన్నాయి రాగాలు తీస్తున్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం 'అఖండ-2'లో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ను తప్పించడం వల్లే హీరో సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మొదటి భాగంలో గ్లామర్ తో కట్టిపడేసి, యాక్టింగ్ లోనూ గ్రామర్ ప్రదర్శించి ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ను ఎందుకు తీసేశారు అన్నదే ప్రశ్న! ఈ సినిమాలో కథ ప్రకారం ప్రగ్యా జైస్వాల్ 12 ఏళ్ళ అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది. అందుకు ఆమె అంగీకరించలేదట. అయితే డైరెక్టర్ స్టోరీ ప్రకారం తప్పదు అని కన్విన్స్ చేయడంతో ఓకే చెప్పారట ప్రగ్య. అయితే అందుకోసం ముందుగా ఒప్పందం చేసుకున్న పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలనీ డిమాండ్ చేయడంతోనే ప్రగ్యా జైస్వాల్ ను తప్పించినట్టు సమాచారం. ఈ విషయాలేవీ బాలయ్యకు తెలియవు. తెలిసిన తరువాత పాన్ ఇండియా మూవీ తీస్తూ లెక్కలు వేసుకుంటే ఎలా అంటూ దర్శక నిర్మాతలను మందలించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini) తో పాటు 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట (Ram Achanta), గోపీ ఆచంట (Gopi Achanta) నిర్మిస్తున్న విషయం తెలిసిందే!
సంజయ్ దత్ సంగతేంటి!?
మరో విషయంలోనూ బాలకృష్ణ, దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావించినప్పుడే ఇందులో విలన్ గా సంజయ్ దత్ (Sanjay dutt) ను అనుకున్నారు. అయితే సంజయ్ దత్ రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండడంతో ఆయన బదులు కథకు కాసిన్ని మార్పులుచేసి ఇందులో ఏకంగా నలుగురు విలన్స్ ను ప్రవేశ పెట్టారట. అందులో ఒకరు ఆది పినిశెట్టి (Aadi Pinisetty). సంజయ్ దత్ ను తీసుకోకపోవడంపైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ రెండు విషయాల్లోనే బాలయ్య తన అసంతృప్తిని తెలిపారని ఇన్ సైడ్ టాక్!. అంతే తప్ప, బాలయ్య, బోయపాటి మధ్య ఏ లాంటి పొరపొచ్చాలు లేవని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. అదీగాక, బాలకృష్ణ మునుపటి కంటే ఉత్సాహంగా ఈ సినిమాలో నటిస్తూ ఉండడం విశేషమనీ వారు అంటున్నారు. పైగా తారాగణం ఎంపికలో జరిగిన మార్పులకు కేవలం బోయపాటి శ్రీనునే కాదు, నిర్మాతలనూ బాలయ్య తప్పు పట్టారు. నిర్మాతల్లో ఆయన కూతురు కూడా ఉండడం గమనార్హం! ఈ నెల 18 తేదీ వరకు సంఘీ విలేజ్ లో వేసిన భారీ సెట్ లో బాలయ్య పాల్గొంటారు. తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన సెట్స్ లో షూటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న డేట్ ఫిక్స్ చేసుకున్న 'అఖండ-2' జనాన్ని ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
Also Read: James Cameron: ఎ.ఐ. గురించి టాప్ ఫిల్మ్ మేకర్ ఏమన్నారంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి