Tollywood: నిన్న డ్రగ్స్... నేడు బెట్టింగ్ యాప్స్!

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:46 AM

డ్రగ్స్ వ్యవహారం నుండి ఇంకా బయటకు రాకముందే... తెలుగు సినిమా రంగాన్ని బెట్టింగ్ యాప్స్ కాళరాత్రిని గుర్తు చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇంతవరకూ యూ ట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కు చెమటలు పట్టించిన పోలీసులు ఇప్పుడు టాలీవుడు సెలబ్రిటీస్ పై దృష్టి పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ను సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేస్తూ వచ్చిన వారిపై నజర్ పెట్టారు. అంతేకాదు... కార్యరంగంలోకి సైతం దిగారు. తాజాగా అగ్ర కథానాయకులు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా (Rana)తో పాటు ప్రకాశ్‌ రాజ్ (Prakash Raj), మంచు లక్ష్మీ (Manchu Laxmi), ప్రణీత (Praneetha), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), అనన్య నాగళ్ళ (Ananya Nagalla), యాంకర్స్ శ్రీముఖి, వర్షిణి, సిరి హన్మంతు పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో కొందరిని విచారణకు సైతం పిలిచారు. తాజాగా యాంకర్ విష్ణు ప్రియ సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తన వాదనను వినిపించారు. బెట్టింగ్స్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీస్ లక్షల రూపాయలను సంపాదించడమే కాదు... వీటిలో పెట్టుబడి పెడితే... అధిక లాభాలు సైతం వస్తాయని ప్రకటనల్లో చెప్పడమే వారిని ఈ కష్టాల్లోకి తీసుకొచ్చిందని తెలుస్తోంది.


ఇదిలా ఉంటే... ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన కొందరు తమ తప్పు తెలుసుకుని, ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి యాప్స్ లో డబ్బులు పెట్టి అప్పులపాలు కావద్దని తెలిపారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వీరి పరిస్థితి తయారైందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు నటీనటులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోవద్దంటూ హితవు పలికారు. ఏదేమైనా మొన్నటి వరకూ డ్రగ్స్ కేసుల వ్యవహారంతో ఉక్కిరి బిక్కిరి అయిన తెలుగు సినిమా రంగాన్ని ఇప్పుడీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం నిద్రపోనీకుండా చేస్తోంది.

Also Read: Sobhita Dhulipala: మా ఆయన బంగారం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 20 , 2025 | 01:53 PM