Thandel Piracy: ఆర్‌టీసీ ఛైర్మన్ విచారణకు ఆదేశాలిచ్చినా అదే పునరావృతం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:34 PM
తండేల్’ (Thandel Piracy) సినిమాను పైరసీ భూతం వదలడం లేదు. ఇప్పటికే ఆర్టీసీ ఛైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా ఆయన విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
‘తండేల్’ (Thandel Piracy) సినిమాను పైరసీ భూతం వదలడం లేదు. ఈ సినిమాను పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి ఆర్టీసీ ఛైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా ఆయన విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిర్మాత బన్ని వాసు మరో పోస్ట్ పెట్టారు. తండేల్ ప్రదర్శిస్తోన్న వీడియోను, ఆ బస్సు టికెట్‌ను షేర్ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లు చెప్పారు.
‘‘మా సినిమా పైరసీని మరోసారి ప్రదర్శించారు. దీనివల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. ఇది ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే’’ అని బన్ని వాసు (Bunny Vasu) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో ఇలా పైరసీ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించకుండా కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైౖర్మన్ కొనకళ్ల నారాయణరావుకు (Konakalla Narayana) విజ్ఞప్తి చేశారు. నాగచైతన్య (Naga chaitanya), సాయిపల్లవి (Sai pallavi) నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’. ఇది రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చింది. ఆర్టీసీ బస్సులో సినిమాను ప్రదర్శించిన ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బన్ని వాసు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణను కోరగా ఆయన విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మరో బస్సులో సినిమాను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.