Heera: అజిత్ పై ఆరోపణల వెనుక హస్తమెవరిది....
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:17 PM
స్టార్ హీరో అజిత్ పై అలనాటి కథానాయిక హీరా రాజగోపాల్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆమె బ్లాగ్ లో పోస్ట్ చేసిన ఆ వార్త ఇప్పుడు వైరల్ అవ్వడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ పై అలనాటి నాయిక హీరా రాజగోపాల్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. చిత్రం ఏమంటే... ఈ యేడాది జనవరి నెలలో హీరా తన బ్లాగ్ లో పేరు ప్రస్తావించకుండా రాసిన ఆ వార్త సరిగ్గా అజిత్ కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం పొందుతున్న సమయంలోనే వైరల్ అయ్యింది.
హీరో అజిత్ (Ajith), హీరోయిన్ హీరా రాజగోపాల్ (Heera Rajagopal) కలిసి 1996లో 'కాదల్ కొట్టై' (Kadal Kottai) మూవీలో నటించారు. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో 'ప్రేమలేఖ' (Premalekha) గా విడుదలై ఇక్కడా సక్సెస్ సాధించింది. ఆ సమయంలో చిగురించిన ప్రేమ వారి సహజీవనానికి దారితీసిందని కోలీవుడ్ లోని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత అజిత్, హీరా బంధానికి బ్రేక్ పడింది. హీరాతో తెగదెంపులు చేసుకున్న అజిత్... ఆ పైన తనతో కలిసి 1999లో 'అమర్కాలం' (Amarkalam) లో నటించిన షాలిని (Shalini) ని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికీ వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోంది.
ఇక హీరా రాజగోపాల్ విషయానికి వస్తే... ఆమె తమిళంతో పాటు తెలుగులోనూ పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోస్ సరసన పలు సినిమాలు చేసింది. కానీ క్రమంగా అవకాశాలు తగ్గడంతో చిత్రసీమ నుండి వైదొలగింది. అలాంటి హీరో రాజగోపాల్ ఈ యేడాది జనవరి నెలలో తన బ్లాగ్ లో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ హీరోగా తాను సహజీవనం చేశానని, అతనికి ఎంతో దన్నుగా నిలిచానని, వెన్నుముక సమస్యతో బాధపడినప్పుడు హాస్పిటల్ లో సపరిచర్యలు చేశానని, తనను పూర్తిగా వాడుకున్న ఆ కథానాయకుడు ఆ తర్వాత తనపై డ్రగ్ ఎడిక్ట్ అనే నిందమోపి, దూరం పెట్టేశాడని వాపోయింది. హీరా రాజగోపాల్ తమిళ చిత్రంలో నాయికగా రాణించిన సమయంలో అజిత్ తో సన్నిహితంగా మెలగడం తెలిసినవారు ఆమె అతని గురించే ఈ విషయాలను రాసిందనే అభిప్రాయానికి వచ్చేశారు. తనతో గొడవపడిన ఆ హీరో... ఆ తర్వాత తన తోటి నటిని పెళ్ళిచేసుకున్నాడని, ఆ సమయంలో మధ్యవర్తులతో జరిగిన మీటింగ్ లో 'తను పనిమనిషి లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నానని, అందువల్ల ఇకపై ఎవరితో శృంగారంలో పాల్గొన్నా, ఆమె నుండి అభ్యంతరం రాద'ని చెప్పాడని తెలిపింది. అజిత్ పేరు ఆ మేటర్ లో ప్రస్తావించకపోయినా... అతన్ని, అతని భార్య షాలిని ని సైతం హీరా ఇలా కించపరుస్తూ మాట్లాడటాన్ని అజిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
హీరా జనవరిలో ఈ పోస్ట్ పెట్టినప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ అజిత్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో దీనికి వెలుగులోకి తీసుకురావడం, అజిత్ క్యారెక్టర్ ను దారుణంగా కించపరిచే రాతలు అందులో ఉండటం... అభిమానులను బాధించింది. తమ హీరో అంటే గిట్టని వారే దొంగచాటుగా ఇలాంటి పనులు చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో అజిత్ తో బాగా వైరం ఉన్నది హీరో విజయ్ ఫ్యాన్స్ కే! సో... హీరా బ్లాగ్ లో పెట్టిన పోస్ట్ ను ఇలా వైరల్ చేయడం వెనుక వారి హస్తం ఉండి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అజిత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read: Tollywood: ఏప్రిల్ సినిమాల కథేంటి...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి