Shine Tom Chacko: డ్రగ్స్ కేస్ లో దేవర విలన్ అరెస్ట్

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:27 PM

ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) వ్యవహారం థ్రిల్లర్ మూవీని త‌ల‌పిస్తోంది. పోలీసుల‌కు చిక్కకుండా త‌ప్పించుకుంటున్న చాకో ఎట్టకేలకు శనివారం దొరికిపోయాడు. సీసీ కెమెరాలు అత‌న్ని ప‌ట్టించాయి. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు... అనంతరం అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి వ్యవహారంపై దృష్టిపెట్టారు. షైన్ టామ్ చాకో తెలుగులోనూ పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. ముఖ్యంగా 'దసరా' (Dasara), 'దేవర' (Devara) చిత్రాలు అతనికి ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాకో అరెస్ట్‌కు ముందు సంఘ‌ట‌ల‌ను సినిమా స్టోరీని త‌ల‌పించాయి.


కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇటీవల సోదాలు చేశారు. అయితే పోలీసుబృందం హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్‌ టామ్‌ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మూడో అంతస్తులో ఉన్న అతను... కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడినుంచి పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు నటుడికి సమన్లు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎర్నాకుళం నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజ‌ర‌వ‌గా పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇంతకుముందు కూడా 2015లో కొకైన్ తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడు షైన్ టామ్ చాకో. ఇటీవ‌ల‌ మలయాళ నటి విన్సీ (Vincy ) షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుని త‌న‌ను ఇబ్బందిపెట్టాడ‌ని ఆరోపించింది. 'సూత్రవాక్యం’ (Soothavakyam) సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) కు కంప్లీట్ చేసింది. అలానే ఫిల్మ్ ఛాంబర్ కు, సినిమా ప్రొడక్షన్ హౌస్ కు తనకు జరిగిన అన్యాయాన్ని నివేదించింది. దాంతో వీరంతా సమావేశమై తదుపరి కార్యాచరణ గురించి యోచన చేస్తున్నారు. ఇదిలా ఉంటే... షైన్ టామ్ చాకో వ్యవహారంతో మరోసారి మల్లూవుడ్ లో తీగలాగినట్టయ్యింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నటీనటులు, వారు చేస్తున్న సినిమాలపై నార్కొటిక్ అధికారులు నజర్ పెట్టారు. హేమ కమిటీ రిపోర్ట్ తోనే అతలాకుతలమైన మలయాళ చిత్రసీమ... ఈ డ్రగ్స్ వ్యవహారం నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.

Also Read: Premalu: ఆకట్టుకునేలా జింఖానా మూవీ ట్రైలర్

Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 19 , 2025 | 05:27 PM