Raj Tharun: మారుతి ఆవిష్కరించిన పాంచ్ మినార్ టీజర్
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:22 PM
కొన్నేళ్ళుగా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు రాజ్ తరుణ్. అతని తాజా చిత్రం 'పాంచ్ మినర్' త్వరలోనే జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) కొంతకాలంగా తన సినిమా వల్ల కాకుండా వివాదాల కారణంగా వార్తలలో నానుతున్నాడు. అయితే... ఇన్ని వివాదాల మధ్య కూడా అతను సినిమాలకు స్వస్తి పలకలేదు. గతంలో కంటే కూడా ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. గత యేడాది రాజ్ తరుణ్ నటించిన పలు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. అయితే అవేవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. దాంతో త్వరలో విడుదల కాబోతున్న 'పాంచ్ మినర్' (Paanch Minar) మీదనే రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు.
రాజ్ తరుణ్, రాశి సింగ్ (Rasi Singh) జంటగా 'పాంచ్ మినార్' మూవీని రామ్ కుడుముల తెరకెక్కించారు. ఈ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ కు గోవిందరాజు సమర్పకులు కాగా మాధవి, ఎమ్మెస్సెమ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికీ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ 'ఏం బతుకురా నాది' విడుదలై చక్కని ఆదరణ పొందింది. ఆదివారం ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు మారుతి (Maruthi) ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
'లిమిటెడ్ బడ్జెట్ లో, చక్కని క్వాలిటీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇంప్రసివ్ గా ఉంద'ని మారుతి కితాబిచ్చారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రామ్ కు ఎస్.కె.ఎన్. శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహితుడు రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను సాయి రాజేశ్ (Sai Rajesh) వ్యక్తం చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన పాటకు శేఖర్ చంద్ర (Sekhar Chandra) చక్కని బాణీని అందించారని, అది బాగా పాపులర్ అయ్యిందని, సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉందని హీరో రాజ్ తరుణ్ అన్నారు. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు రాశిసింగ్ ధన్యవాదాలు తెలిపింది. చాలామంది పాంచ్ మినార్ అంటే అర్థం ఏమిటని అడుగుతున్నారని, అది సినిమా చూస్తే తెలుస్తుందని దర్శకుడు రామ్ అన్నారు. 'పాంచ్ మినర్' కడుపుబ్బ నవ్వించే చిత్రమని, అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు ఎంఎస్ఎం రెడ్డి, గోవిందరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ధీరజ్ మొగిలినేని, విజయ్ పాల్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, డార్లింగ్ స్వామి, గీత రచయిత అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nani Vs Suriya: మే1న మోస్ట్ వయొలెంట్ మూవీస్
Also Read: Balakrishna : బోయపాటితో చెడిందా!?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి