Hit 3: నాని సినిమా పెద్దలకు మాత్రమే...

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:08 PM

నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ -3' చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. అలానే 'హిట్ -3' నుండి తాజాగా ప్రమోషనల్ సాంగ్ ఒకటి విడుదలైంది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్ పాడాడు.

నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ -3' (Hit-3) మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఇతర రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో మీడియాను కలుస్తున్నారు. అక్కడి ఫిల్మ్ కరస్పాండెంట్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 'హిట్ -3' దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను (Dr. Sailesh Kolanu) సినిమాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉంటే... ప్రచార బాధ్యతను నాని తన భుజానికి ఎత్తుకున్నారు. 'హిట్ -3' కి నాని కూడా నిర్మాతే కావడంతో అది మరింత బాధ్యతాయుతమైన పనిగా మారిపోయింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తో కలిసి మూవీ ముచ్చట్లను మీడియా ద్వారా మూవీ లవర్స్ కు నాని చేరవేస్తున్నారు.


ఇదిలా ఉంటే మే 1న వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న 'హిట్ -3'కి అనుకున్నట్టుగానే 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. సో... ఇది పెద్దల కోసం తీసిన సినిమా. అంటే 18 సంవత్సరాల పైబడిన వారిని 'హిట్ -3' థియేటర్లలోకి అనుమతిస్తారు. నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ హీరోగా పేరుంది. వేసవి సెలవుల్లో నాని సినిమా వచ్చిందంటే... కుటుంబ సమేతంగా అతని సినిమాను చూడాలని జనాలు భావిస్తారు. కానీ ఈ కథకు పూర్తి న్యాయం చేకూర్చాలంటే... తగిన మోతాదులో హింస తప్పని సరి అని నాని అండ్ టీమ్ భావించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన వారికి ఈ చిత్రంలో రక్తం వరదలై పారినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన హిందీ చిత్రం 'యానిమల్', మలయాళ చిత్రం 'మార్కో' ప్రేరణతో 'హిట్ -3' తెరకెక్కినట్టు అనిపిస్తోందిన విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలానే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఓ పాటను సైతం శుక్రవారం విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్ పాడారు. 'తన కోసమేనా...' అంటూ సాగే ఈ పాటను రాఘవ రాశారు.


నాని నిర్మాణంలో వచ్చిన 'హిట్'లో విశ్వక్ సేన్ (Vishwaksen) హీరో కాగా, 'హిట్ -2'లో అడివి శేష్ (Adivi Shesh) హీరోగా నటించాడు. 'హిట్ -3'లో నాని నటించగా, 'హిట్ -4' తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) నటిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కార్తీ నటిస్తున్నాడని తెలిసిన కొందరు పాత్రికేయులు ఆ విషయాన్ని వార్తగా రాయడంతో దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను ఆవేదన వ్యక్తం చేశాడు. ధియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ కావాలని కొన్నింటిని గోప్యంగా ఉంచుతామని, వాటిని బహిర్గతం చేయడం సబబు కాదని ఆయన వాపోయారు. 'హిట్' ఫ్రాంచైజ్ లో తొలి చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ రాగా, 'హిట్ -2'కు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు దానిని మించి హింస ఉన్న 'హిట్ -3' కూ 'ఎ' సర్టిఫికెట్ లభించింది. మరి నేచురల్ స్టార్ నాని నుండి వస్తున్న ఈ హింసాత్మక చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: AP CM: ఆ ఆలోచన వచ్చిన తొలి నటుడు చిరంజీవి: ఏపీ సీఎం

Also Read: Naga Chaitanya: తారక్‌ నోట.. చైతూ రెస్టరెంట్‌ స్పెషల్స్‌

Also Read: Sarangapaani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 25 , 2025 | 05:10 PM