Ground Zero: బి.ఎస్.ఎఫ్. జవాన్ గా ఇమ్రాన్ హష్మీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:29 PM

పార్లమెంట్ పై దాడికి సూత్రధారి ఘాజీ బాబాను బీఎస్ఎఫ్ బృందం హతమార్చిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది 'గ్రౌండ్ జీరో' చిత్రం. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. కశ్మీర్ లోని ముస్లిమ్స్ మైండ్ సెట్ ను మార్చి పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలు భారతదేశం నుండి కశ్మీర్ ను విడదీయాలని దశాబ్దాలుగా చూస్తున్నాయి. వారి కుట్రలు, కుతంత్రాలను ఎండగడుతూ భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకులైన కశ్మీర్ పౌరులు, ఆర్మీ జవాన్లు సమిథలవుతున్నారు.


ఈ నేపథ్యంలో తెరకెక్కింది 'గ్రౌండ్ జీరో' (Ground Zero) చిత్రం. 2001లో ఇండియన్ పార్లమెంట్ పై అటాక్ జరిగిన తర్వాత కశ్మీర్ లోని తీవ్రవాదులను ఏరివేయడానికి బీఎస్ఎఫ్ (BSF) ఎలాంటి చర్యలు చేపట్టిందనేది ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దుబే గా ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) నటించాడు. పార్లమెంట్ దాడిలో సూత్రధారి అయిన ఘాజీ బాబా (Ghazi Baba) ను బీఎస్ఎఫ్ జవాన్ల బృందం ఎలా హతమార్చిందో ఈ సినిమాలో చూపించారు. కశ్మీర్ భూభాగమే కాదు... అక్కడి మనుషులు సైతం భారత్ కు చెందినవారే అనే భావనతో నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఈ సినిమా ద్వారా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. తేజస్ ప్రభ, విజయ్ దోస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాను రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ఏప్రిల్ 25న 'గ్రౌండ్ జీరో' సినిమా జనం ముందుకు వస్తోంది.

Updated Date - Apr 07 , 2025 | 05:30 PM