Yevade Subramanyam: మరోసారి హిమాలయాలకు నాని...
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:27 AM
పదేళ్ళ తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతువర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో నాగ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
పదేళ్ళ క్రితం మార్చి 21న నాని (Nani), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కీలక పాత్రలు పోషించిన 'ఎవడే సుబ్రమణ్యం' (Yevade Subramanyam) మూవీ విడుదలైంది. దీని ద్వారానే నాగ అశ్విన్ (Naga Ashwin) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ పదేళ్ళలో నాని నేచురల్ స్టార్ గా అవతరించి మంచి పొజిషన్ కు చేరుకుంటే... విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. అంతేకాదు... జాతీయ స్థాయలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'మహానటి (Mahanati), కల్కి 2898 ఎ.డి (Kalki 2898 A.D)' సినిమాలతో నాగ అశ్విన్ కూడా నేషనల్ వైడ్ రికగ్నైజేషన్ సాధించాడు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' ఇప్పుడు అదే తేదీన మరోసారి రీ-రిలీజ్ అవుతోంది. రీతువర్మ (Ritu Varma), మాళవిక నాయర్ (Malavika Nair) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ఇది సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్. మూవీలో హీరో నానినే అయినా... తన పాత్రతో విజయ్ దేవరకొండ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు సైతం ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. దూద్ కాశీ యాత్ర నేపథ్యంలో సాగే ఈ ట్రావెల్ బేస్డ్ మూవీని మరోసారి వైజయంతి మూవీస్ సంస్థ జనాల ముందుకు తీసుకురావాలనుకోవడం అభినందించదగ్గది.
నెల రోజుల వ్యవథిలో ఆ ఇద్దరికీ రెండు చిత్రాలు!
'ఎవడే సుబ్రమణ్యం'లో హీరోగా నటించిన నాని ఇవాళ నిర్మాత కూడా. అతను నిర్మించిన 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే సినిమా మార్చి 14న హోలీ సందర్భంగా విడుదల కాబోతోంది. ఆ తర్వాత వారమే 'ఎవడే సుబ్రహ్మణ్యం' విడుదల అవుతుంది. ఓ నిర్మాతగా నాని తీసిన సినిమాను, హీరోగా నాని నటించిన సినిమాను బ్యాక్ టూ బ్యాక్ ఆయన అభిమానులు చూసేయొచ్చు. అలానే 'ఎవడే సుబ్రమణ్యం'లో కీలక పాత్ర పోషించిన రీతు వర్మ హీరోయిన్ గా నటించిన 'మజాకా' మూవీ ఫిబ్రవరి 26న విడుదల అవుతోంది. 'ఎవడే సుబ్రమణ్యం' సో... నెల రోజుల వ్యవథి లోనే రీతు వర్మ నటించిన మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న మాట!