Drugs: మొన్న కె.పి. చౌదరి, నేడు కేదార్... టాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి!

ABN , Publish Date - Feb 27 , 2025 | 11:03 AM

ఫిబ్రవరి మాసంలో ఇద్దరు తెలుగు నిర్మాతలు మృతి చెందారు. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకుంటే... ఫిబ్రవరి చివరి వారంలో కేదార్ దుబాయ్ లో తుది శ్వాస విడిచారు. వీరిద్దరూ డ్రగ్స్ కేసులో నిందితులు కావడం విశేషం.

తీగలాగితే డొంక కదిలిన వైనం ఇప్పుడు కళ్ళముందు సాక్షాత్కరిస్తోంది. దుబాయ్ లో తెలుగు సినిమా నిర్మాత కేదార్ (Kedar) సెలగంశెట్టి హఠాన్మరణం, తదనంతర పరిణామాలతో టాలీవుడ్ (Tollywood) ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సినిమా నిర్మాతగా కంటే... కేదార్ కు చిత్రసీమలోని వివిధ వర్గాలకు వేరే రకంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను కేదార్ కొంతకాలంగా నిర్వహిస్తున్నారట. దాంతో చాలామంది సినీ ప్రముఖులు కేదార్ ద్వారా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని సమాచారం. అంటే... వీరందరికీ కేదార్ దుబాయ్ లో బినామీగా వ్యవహరిస్తున్నాడని అనుకోవచ్చు. కేవలం సినిమా వర్గాలతోనే కాకుండా... రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులతోనూ కేదార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టయ్యింది. బుధవారం న్యూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సైతం టాలీవుడ్ వర్గాలలో కలవరాన్ని రేపాయి. కేదార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వారంతా ఇప్పుడు భుజాలు తడుముకునే పరిస్థితి నెలకొంది.


drugs1 copy.jpg

నిజానికి ఐదేళ్ళ క్రితం 2020 సెప్టెంబర్ లో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా నిర్మించబోతున్నట్టు ఫాల్కన్ క్రియేషన్స్ అధినేత కేదార్ ప్రకటించారు. అయితే... ఆ తర్వాత యేడాదికి ఆ సినిమా ఉండకపోవచ్చుననే రూమర్స్ వచ్చాయి. 2021 ఏప్రిల్ 19న ఆ వదంతులను ఖండిస్తూ, సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీ ఖచ్చితంగా ఉంటుందని, అప్పటికి విజయ్ చేస్తున్న 'లైగర్', సుకుమార్ తీస్తున్న 'పుష్ప' (Pushpa) చిత్రాలు పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళుతుందని కేదార్ మరోసారి స్పష్టం చేశారు. కానీ సుకుమార్ 'పుష్ప-2' కూడా పూర్తి చేసేశారు. మరో పక్క విజయ్ దేవరకొండ 'లైగర్' (Liger) తర్వాత 'ఖుషీ, ఫ్యామిలీ స్టార్' సినిమాలలో నటించాడు. కానీ కేదార్ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా కేదార్ 'గం గం గణేశా' (Gam Gam Ganesha) చిత్రాన్ని నిర్మించి, 2024లో విడుదల చేశారు.

కేవలం సినిమా నిర్మాతగా కాకుండా పబ్ నిర్వాహకుడిగానూ కేదార్ కు అనుభవం ఉంది. విశేషం ఏమంటే... అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో సహా తెలుగు హీరోలు కొంతమంది పబ్ బిజినెస్ లోకీ ఎంటర్ అయ్యారు. సామాజిక బాధ్యతతో సినిమాలు చేసి, సమాజానికి ఎంతోకొంత మంచిని అందించే ప్రయత్నా్న్ని పక్కన పెట్టి, పబ్ ను నడపడం ద్వారా కోట్లు గడించవచ్చని వీరు భావించారు. అయితే దీని ద్వారా యువత చెడు మార్గాలవైపు పయనిస్తుందని కానీ, చెడు వ్యసనాలకు బానిస అవుతుందని కానీ వీరు ఆలోచించలేదు. కేదార్ మరణం తర్వాత ఇలాంటి వారందరిపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి పెట్టారు.


ఫిబ్రవరి మొదటి వారంలో తెలుగు డబ్బింగ్ చిత్రాల నిర్మాత, డ్రగ్స్ కేసులో విచారణలను ఎదుర్కొంటున్న కె.పి. చౌదరి (K.P. Chowdary) కూడా గోవాలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఫర్వాలేదు గానీ ఒక్కసారి వ్యవహారం బెడిసి కొడితే... జీవితాలు గల్లంతైపోతాయనడానికి ఈ రెండు సంఘటనలు చాలు. కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందులు, డ్రగ్స్ కు బానిస కావడం వంటి కారణాలే వీరి మరణాల వెనుక ఉన్నాయా... లేక ఏవైనా అదృశ్య శక్తుల హస్తం ఈ మరణాల వెనుక ఉందా? అనే సందేహాన్ని ప్రభుత్వ పెద్దలు మీడియా ముందు పెట్టడం కూడా ఇవాళ చర్చనీయాంశమైంది. కేదార్ తో సినిమా చేయడానికి అంగీకరించిన స్టార్ హీరో అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశానని మిత్రులకు తెలియచేశాడట. ఇదిలా ఉంటే కేదార్ ను నమ్మి కోట్ల రూపాయలను దుబాయ్ లో బిజినెస్ చేయడానికి ఇచ్చామని, ఇప్పుడు తమ డబ్బులు ఏమైపోతాయో అర్థం కావడం లేదని కొందరు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.

ఏదేమైనా... మొన్న కె.పి. చౌదరి, నేడు కేదార్ మరణాలు చిత్రసీమలో తీవ్ర అలజడులకు కారణం అయ్యాయి.

Updated Date - Feb 27 , 2025 | 11:12 AM