Sankranti 2025: సంక్రాంతి బరిలో ఉన్న ఈ పందెం కోళ్ల సంగతేంటి?
ABN , Publish Date - Jan 12 , 2025 | 09:49 AM
సంక్రాంతి అంటేనే దర్శకనిర్మాతలకు కలిసొచ్చే పండగ. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ పోటీ పడుతుంటాయి. కానీ ఈసారి స్టార్ హీరోల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో, బాలయ్య ‘డాకు మహారాజ్’తో, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బరిలోకి దిగారు. పొంగల్ బరిలో ఉన్న ఈ పందెం కోళ్ల సంగతేంటో చూద్దామా..
సంక్రాంతి పండగకు, తెలుగు చిత్రసీమకు మధ్య ఓ బలమైన సెంటిమెంట్ ఉంటుంది. ఈ పండగకు విడుదలైన వాటిలో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సందర్భాలు అనేకం. అందుకే సంక్రాంతి అంటేనే దర్శకనిర్మాతలకు కలిసొచ్చే పండగ. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ పోటీ పడుతుంటాయి. కానీ ఈసారి స్టార్ హీరోల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సంక్రాంతి బరిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే తలబడుతున్నాయి.
ఈ సంక్రాంతికి విడుదలైన తొలి చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’. జనవరి 12న విడుదలైంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించారు. చివరగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఎఫ్2, ఎఫ్3 తరవాత వస్తున్న సినిమా అయినందున ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలు పెంచిన ట్రైలర్స్...
సినిమాలను విడుదల చేసే క్రమంలో మూడు చిత్రాల ట్రైలర్లు విడుదలయ్యాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్లు కూడా వరుస క్రమంలోనే విడుదలవడం గమనార్హం. ముందుగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ మంచి హైప్‌ని క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో రామ్‌చరణ్ మాస్ లుక్‌తో పాటు, కాస్ట్‌లీ విజువలైజేషన్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం గురించి నిర్మాత దిల్‌రాజు ఓ ప్రమోషన్‌లో మాట్లాడుతూ ‘శంకర్ గారు ఏం చేస్తారండీ! ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ అంటున్నారు. ఇది నా కమ్‌బ్యాక్ ఫిల్మ్. ప్రేక్షకులు విజిల్ వేసే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి’ అని అన్నారు. ఆయన అన్నట్టుగానే సినిమా విడుదలైన తరవాత రామ్‌చరణ్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే సినీ విమర్శకులు మాత్రం యావరేజ్ అనే అంటున్నారు. ‘నానా హైరానా’ పాటకి సినిమాలో చోటు లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే ఆ లోటు కూడా తీరింది. ఆ పాటను మేకర్స్ యాడ్ చేశారు. జనవరి 14న అని చెప్పారు కానీ.. ముందే ఆ పాటను యాడ్ చేశారు.
Also Read-Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆయన అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. బాలయ్య, సంక్రాంతి కాంబినేషన్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ చిత్రం రిలీజ్‌తో మళ్లీ ఓ మ్యాజిక్ క్రియేట్ అయ్యేలా ఉంది అని అంటున్నారు బాలయ్య అభిమానులు. ‘భగవంత్ సింగ్ కేసరి’లో తండ్రీ కూతుళ్ల సంబంధం ఉన్నట్లే ఈ చిత్రంలోనూ ఓ చిన్న పాప సెంటిమెంట్‌ని చేర్చారు. బాలయ్య అంటే యాక్షన్ ఉండటమే కాదు... బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉండాలి. ఆ కోణంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ తెలియజేస్తోంది. అటు నిర్మాతలు కూడా చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘దబిడి దిబిడి’ పాట బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై కొంత వివాదం రేగినప్పటికీ టార్గెట్ ఆడియెన్స్‌కి బాగానే రీచ్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇక మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ 14న విడుదలవుతోంది. ఇది ఒక కుటుంబ కథా చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సంక్రాంతి సందడి మొత్తం ట్రెయిలర్‌లో కనిపిస్తుంది. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా అందులో కుటుంబ సభ్యులందరూ కలసి సరదాగా చూడగలిగే లైట్ హార్టెడ్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే పండగ అంటే ఫ్యామిలీస్ కలుసుకోవడం. సినిమాలకు వెళ్లడం ఒక సంప్రదాయం. ఈసారి ఆ ప్రత్యేకతను ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సొంతం చేసుకుంది. పైగా దిల్‌రాజు, వెంకటేశ్, అనిల్ రావిపూడి... ఈ ముగ్గురి కాంబినేషన్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్. ఇది వరకే వచ్చిన ఎఫ్2, ఎఫ్3తో ఇది రుజువైంది. కాబట్టి ప్రేక్షకులు ఈ పండగకు ఏ చిత్రం చూసినా చూడకపోయినా.. దీన్ని మాత్రం చూడకుండా వదల్లేరు అనే టాక్ వస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అదిరిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. స్వయంగా వెంకటేశ్ ఓ పాటను ఆలపించడం ఈ చిత్రానికే హైలైట్. కనుక ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూసే అవకాశాలున్నాయి.
పాటల ప్రత్యేకత...
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ‘గోదారి గట్టు’ పాట అత్యధిక వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 85 వేల మిలియన్ల మంది చూశారు. ఈ పాటను రమణ గోగుల, మధు ప్రియతో కలసి పాడారు. 18 ఏళ్ల బ్రేక్ తరవాత రమణ గోగుల తిరిగి ఆలపించిన పాట ఇదే. సంగీతం... భీమ్స్ సిసిరోలియో. ‘గేమ్ ఛేంజర్’లోని ‘జరగండి’ పాట 55 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇదే చిత్రంలోని ‘నానా హైరానా’ (52 మిలియన్లు), ‘రా రా మచ్చా‘ (42 మిలియన్లు) వ్యూస్ దక్కించుకున్నాయి. ‘ధూప్’ సాంగ్ 30 మిలియన్లతో కొనసాగుతోంది. కాగా, ‘హైరానా’ పాటని న్యూజిలాండ్‌లో ఆరు రోజుల పాటు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో తీశారు. ఒక్కో సన్నివేశాన్ని ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీగా మలిచారు. బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీని అందించారు. ఒక్క ఈ పాట చిత్రీకరణకే రూ.10 కోట్లు ఖర్చు పెట్టినట్లు వినికిడి. ‘డాకు మహారాజ్’ చిత్ర గీతాలు కూడా అభిమానులను అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘డబిడి దిబిడి’ 13 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ‘రేజ్ ఆఫ్ డాకు’ (5 మిలియన్లకు పైగా), ‘చిన్ని’ పాట(4 మిలియన్లకు పైగా) వ్యూస్ పొందాయి.
ప్రచారంలో కొత్త ఒరవడి...
కొవిడ్ తరవాత సినిమా తీరు మారిపోయింది. మంచి కథను ఎంచుకుని ఎంత గొప్పగా తీసినా థియేటర్లకు ప్రేక్షకులు రాకపోతే ఆ సినిమాకు రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. ప్రేక్షకుల అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే నిర్మాతలు మంచి ఓపెనింగ్స్ సాధించుకుంటారు. అయితే ఈ విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దర్శకుడు అనిల్ రావిపూడి అందరికంటే ముందున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ప్రమోషన్‌ని మొత్తం తన భుజస్కందాలపైనే వేసుకున్నారు. సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ చేశారు. హీరో, హీరోయిన్లు, ఇతర కీలక నటీనటులతో పలు రీల్స్ చేయడమే కాకుండా తానూ అందులో నటించారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ద్వారా తన సినిమాపై అందరికంటే ఎక్కువగా బజ్‌ని క్రియేట్ చేయగలిగారు. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సోషల్ మీడియాలో దూసుకెళ్తోందనే చెప్పొచ్చు.