JR NTR: ఎన్టీఆర్ 'డ్రాగన్' తమిళ టైటిల్ పరిస్థితి ఏంటీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:28 PM
ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలకు పెట్టాలనుకుంటున్న పేర్లు రిజిస్ట్రేషన్ కు ముందే రివీల్ అయిపోతే... ఇతర రాష్ట్రాలలో, భాషల్లో వాటిని ఒకే పేరుతో విడుదల చేయడానికి ఇబ్బంది వస్తోంది. అలాంటి సమస్యే ఇప్పుడు ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prasanth Neel) మూవీకి వచ్చింది.
ఇవాళ తెలుగు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా (Pan India) మూవీస్ చేస్తున్నారు. అందువల్ల తమ సినిమాల టైటిల్స్ ను యూనిక్ గా పెడుతున్నారు. అది ఏ భాష వారికైనా సులభంగా అర్థమయ్యేలా, దేశంలోని అన్ని ప్రాంతాల సినీ అభిమానులు కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు. దాంతో హీరో క్యారెక్టర్ నో, క్యారెక్టరైజేషన్ నో ఎలివేట్ చేసేలా... ఇంగ్లీష్ లో ఈ పేర్లు ఉంటున్నాయి. లేదంటే 'బాహుబలి' (Baahubali) తరహాలో సంస్కృతంలో పెడుతున్నారు. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలకు పెట్టాలనుకుంటున్న పేర్లు రిజిస్ట్రేషన్ కు ముందే రివీల్ అయిపోతే... ఇతర రాష్ట్రాలలో, భాషల్లో వాటిని ఒకే పేరుతో విడుదల చేయడానికి ఇబ్బంది వస్తోంది. అలాంటి సమస్యే ఇప్పుడు ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prasanth Neel) మూవీకి వచ్చింది. ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragan) అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
'కేజీఎఫ్' (KGF) సీరిస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీ మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడని, అందుకే 'సలార్ -2' (Salar -2) సినిమా కూడా కాస్తంత వెనక్కి వెళ్ళిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 'డ్రాగన్' టైటిల్ పై ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైంది. ఈ నెల 21న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganath) హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం 'డ్రాగన్' విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తూ మేకర్స్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే పేరును దీనికి ఖరారు చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తుండటం విశేషం. ఓ పక్క ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' పేరుతో సినిమాను తీస్తూ... అదే టైటిల్ తో వస్తున్న 'డ్రాగన్'ను వీరు రిలీజ్ చేయడం ఏమిటనే ప్రశ్న వస్తోంది. ఆ టైటిల్ క్లాష్ కాకూడదనే తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది' అనేది యాడ్ చేశారని మరికొందరు చెబుతున్నారు.
సహజంగా సినిమా టైటిల్ కు అయిదేళ్ళ కాలపరిమితి ఉంటుంది. అది దాటిపోతే... ఆ టైటిల్ ను ఎవరైనా పెట్టుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి 'డ్రాగన్' అనే పేరు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కానీ... తమిళంలో ఇప్పటికే ఈ పేరుతో సినిమా ఉండటం వల్ల అక్కడ 'డ్రాగన్'కు ముందో వెనుకో ఏదో ఒక పదాన్ని జత చేయాల్సి రావచ్చు. బహుశా తమిళ 'డ్రాగన్' టైటిల్ ను ఇక్కడ తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని మార్చినట్టుగా, రేపు ఎన్టీఆర్ మూవీ 'డ్రాగన్'ను తమిళంలో విడుదల చేసేప్పుడు 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని పెడతారేమో చూడాలి.