Vijay Devarakonda: రౌడీ హీరో తగ్గాడా...
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:18 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 'లైగర్' తర్వాత పాన్ ఇండియా మూవీ చేసిన విజయ్ దేవరకొండ నిర్మాతలను ఖుషీ చేసే పనిలో పడ్డాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ను దూరం నుండి చూసిన వాళ్ళకు అతనిలో యాటిట్యూడ్ కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అతని మంచి మనసు తెలుస్తుంది. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ విజయ్ దేవరకొండ ఎంతోమందికి చేతనైన సాయం చేస్తుంటాడు. అయితే... 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సినిమా టైమ్ లో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి... అదే యాటిట్యూడ్ ను టీవీ ఛానెల్స్ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్స్ లో, పబ్లిక్ ఫంక్షన్స్ లో చూపించే సరికీ... అతనిపై కొందరికి ఓ రకమైన నెగెటివ్ ఒపీయన్ ఏర్పడిపోయింది. దానిని చెరిపేసే ప్రయత్నం విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
'లైగర్' (Liger) ఘోర పరాజయం తర్వాత వచ్చిన 'ఖుషీ' (Khushi), 'ఫ్యామిలీ స్టార్' (Family Star) నిజానికి అంత బ్యాడ్ మూవీస్ ఏమీ కాదు. కానీ జనాలు వాటిని తిరస్కరించారు. 'ఫ్యామిలీ స్టార్' విడుదల కాగానే దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాత సైతం... 'విజయ్ దేవరకొండ మీద ఇంత నెగెటివిటీ ఉంద'ని తనకు తెలియదని ఆశ్చర్యపోయాడు. అయితే... మంచి మనసున్న విజయ్ దేవరకొండతో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాతలూ లేకపోలేదు. అందుకే దిల్ రాజు మరోసారి అతనితో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
'లైగర్' పరాజయం తర్వాత పూరి జగన్నాథ్ ను బయ్యర్లు ఉక్కిరి బిక్కిరి చేయడంతో... తన వంతు సాయంగా విజయ్ దేవరకొండ కొంత రెమ్యూనరేషన్ ను వాపస్ చేశాడు. 'లైగర్' తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' (Kingdom) ను పాన్ ఇండియా మూవీగా చేస్తున్నాడు. దీనిని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవల నాగవంశీ... ఈ సినిమాకు సంబంధించి విజయ్ తో జరిగిన అగ్రిమెంట్ గురించి చెప్పాడు. 'లైగర్' అప్పుడు రెమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చిన విజయ్... ఇప్పుడు 'కింగ్ డమ్'కు జస్ట్ టోకెన్ అమౌంట్ మాత్రమే అడ్వాన్స్ గా తీసుకున్నాడట. సినిమాను అనుకున్న విధంగా భారీగా తీయడానికి అతని నిర్ణయం ఉపయోగపడిందని నాగవంశీ చెప్పాడు. సినిమా విడుదలై, బడ్జెట్ పరంగా బ్రేకీవెన్ అయిన తర్వాత వచ్చే లాభాల నుండి విజయ్ దేవరకొండ బాలెన్స్ రెమ్యూనరేషన్ తీసుకుంటానన్నాడని నాగవంశీ తెలిపాడు. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. 'కింగ్ డమ్' మూవీ మే 30న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Also Read: Tollywood: తెలుగు చిత్రసీమలో తారాజువ్వ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి