Vijay Devarakonda: రెండు భాగాలుగా కింగ్ డమ్

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:52 PM

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'కింగ్ డమ్' కూడా రెండు భాగాలుగా రాబోతోంది. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నామని నిర్మాత నాగవంశీ చెప్పారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజా చిత్రం 'కింగ్ డమ్' (Kingdom) మే 30వ తేదీ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలోనే విజయ్ దేవరకొండ కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నట్టుగా బెట్టింగ్ యాప్స్ వివాదం ముసురుకుంది. అయితే విజయ్ దేవరకొండపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగానే... అతని పీఆర్ బృందం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. చట్టబద్దత ఉన్న బెట్టింగ్ యాప్స్ కు విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉన్నారు తప్పితే... అనధికారికమైన వాటిని ప్రమోట్ చేయలేదని వారు తెలిపారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారకముందే విజయ్ దేవరకొండ స్పందించడం మంచిదయ్యింది. లేకపోతే... రేపు 'కింగ్ డమ్' మూవీ విడుదలయ్యే వరకూ దీనిని కొందరు సాగతీసే ప్రయత్నం చేసేవారు.


ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' ఒకటి కాదు... రెండు భాగాలుగా రాబోతోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) స్పష్టం చేశారు. తన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండు భాగాలు తీయాలనేది తొలుత తమ ఆలోచన కాదని, అయితే స్టోరీ డిమాండ్ బట్టి... ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విశేషం ఏమంటే... విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు భాగాలుగా తెరకెక్కలేదు. అలా వస్తున్న మొదటి చిత్రం 'కింగ్ డమ్' అవుతుంది. నిజానికి సూర్యదేవర నాగవంశీ అండ్ కో ఇలా సినిమాలు ఫ్రాంచైజ్ గా తీయడం కొత్తేమీ కాదు. 'డీజే టిల్లు' (DJ Tillu) సక్సెస్ కాగానే దానికి కొనసాగింపుగా 'టిల్లు స్క్వేర్' (Tillu Square) తీశారు. ఇప్పుడు 'టిల్లు క్యూబ్' కూడా రాబోతోంది. అలానే 'మ్యాడ్' (Mad) సక్సెస్ కాగానే 'మ్యాడ్ స్క్వేర్'గా తీశారు. అది ఈ నెల 28న వస్తోంది. అయితే... ఇవి ఫ్రాంచైజెస్ కాగా 'కింగ్ డమ్' మాత్రం ఒకే కథను రెండు భాగాలుగా తీస్తున్నారు. దీని రెండో భాగానికి 'కింగ్ డమ్ -2' లేదా 'కింగ్ డమ్ స్క్వేర్' అనే పేరు పెడతారట. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Rajitha: నటి రజితకు మాతృవియోగం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 04:52 PM