Suriya: సూర్య - వెంకీ అట్లూరి.. క్లారిటీ వచ్చేసింది
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:07 AM
తమిళ హీరో సూర్య తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో కథలు విన్నారు. ఎట్టకేలకు కథ సెట్ అయింది
తమిళ హీరో సూర్య (Suriya) తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో కథలు విన్నారు. ఎట్టకేలకు కథ సెట్ అయింది. తెలుగులో స్ట్రెయిట్ సినిమాకు సై అన్నారు. వెంకీ అట్లూరి (Venki Atluri) దర్శకత్వంలో ఆయన ఈ చిత్రాన్ని చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) సంస్థ నిర్మించనున్నట్లు సూర్య శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రెట్రో’ ప్రీరిలీజ్ వేడుకలో అఫీషియల్‌గా వెల్లడించారు. మేలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు.
రెట్రో గురించి ఆయన మాట్లాడుతూ "ఇది పూర్తిగా కార్తీక్ సుబ్బరాజ్ సినిమా. వినూత్నమైన రీతిలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా ఈసారి అందర్నీ సంతృప్తి పరుస్తుందని నమ్ముతున్నా. నా సినిమాతో పాటుగా ఆ రోజే విడుదల కానున్న నాని ‘హిట్ 3’ చిత్రం కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఆయన స్థాఫించిన అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ దీనిని ప్రారంభించడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తి అని అన్నారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ "నా కాలేజ్ లైఫ్ లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి.. ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే. ఇక 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్స్ట్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. ఇప్పుడు రెట్రోతో వస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి ట్రైలర్ కట్ నేనెప్పుడూ చూడలేదు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. సూర్య గారు, విజయ్ గారు బ్రదర్స్ లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మే 1న విడుదలవుతున్న రెట్రో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.