Venkatesh: విక్టరీ వెంకటేశ్ ను వీడని 'సంక్రాంతి'!

ABN , Publish Date - Feb 18 , 2025 | 06:19 PM

తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఆనందం' ఆధారంగా 'సంక్రాంతి' రూపొందింది. సంక్రాంతికి రాకపోయినా, ఆ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా శివరాత్రి దాకా జనాన్ని విశేషంగా అలరించింది. ఆ పై మరింతగా ఆదరణ చూరగొంటూ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం.

విక్టరీ వెంకటేశ్ కు 'సంక్రాంతి' పండగ భలేగా అచ్చి వస్తుందని ఈ పొంగల్ బరిలో విజేతగా నిలచిన ఆయన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankrantiki Vastunnam) నిరూపించింది. అలా అచ్చివచ్చిన 'సంక్రాంతి' (Sankranti) టైటిల్ తోనే ఇరవై ఏళ్ళ క్రితం వెంకటేశ్ సినిమా వచ్చింది. అయితే 'సంక్రాంతి' చిత్రం పొంగల్ కు రాలేదు కానీ, 2005 ఫిబ్రవరి 18న రిలీజయింది. అయితేనేం, ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించి వెంకటేశ్ కు ఓ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసింది.


sankranthi.jpg

'సంక్రాంతి' చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు. వినిపించదు. అయినా, ఉమ్మడి కుటుంబాల్లోని అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించడంతో 'సంక్రాంతి' చిత్రం ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఇది నలుగురు అన్నదమ్ముల కథ- అందులో పెద్దవాడుగా వెంకటేశ్, రెండోవాడుగా శ్రీకాంత్, మూడోవాడిగా శివబాలాజీ, చివరివాడిగా శర్వానంద్ నటించారు. వీరి తల్లిదండ్రుల పాత్రల్లో శారద, చంద్రమోహన్ అభినయించారు. వెంకటేశ్ జోడీగా స్నేహ నటించగా, ఆయన మరదలి పాత్రలో ఆర్తి అగర్వాల్ కనిపించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించారు. అంతకు ముందు సూపర్ గుడ్ బ్యానర్ లోనే వెంకటేశ్ హీరోగా 'రాజా' చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ముప్పలనేని శివతోనే ఈ 'సంక్రాంతి' కూడా రూపొందడం విశేషం! కాగా, ఈ రెండు చిత్రాలు తమిళ రీమేక్స్ కావడం గమనార్హం! తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఆనందం' ఆధారంగా 'సంక్రాంతి' రూపొందింది. సంక్రాంతికి రాకపోయినా, ఆ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా శివరాత్రి దాకా జనాన్ని విశేషంగా అలరించింది. ఆ పై మరింతగా ఆదరణ చూరగొంటూ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం!

ఇక సంక్రాంతి సీజన్ కు వచ్చి ఘనవిజయం సాధించిన వెంకటేశ్ చిత్రాలకూ కొదువ లేదు. "రక్తతిలకం, శత్రువు, చంటి, ధర్మచక్రం, కలిసుందాం రా, లక్ష్మీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్-2" వంటి చిత్రాలు ఉన్నాయి. పొంగల్ బరిలోనే పరాజయాలు చూసిన వెంకటేశ్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే సక్సెస్ రేటే ఎక్కువగా ఉండడం విశేషం! ఈ యేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరో పొంగల్ హిట్ వెంకీ కిట్ లో చేరిపోయిందిగా!

Updated Date - Feb 18 , 2025 | 06:19 PM