VD12: విజయ్ దేవరకొండ VD12 టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోలెవరో తెలుసా?
ABN , Publish Date - Feb 09 , 2025 | 06:53 PM
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న VD12 చిత్ర టైటిల్, టీజర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు అన్ని వుడ్‌లలోని స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా టాక్ వినబడుతోంది. ఆ స్టార్ హీరోలు ఎవరంటే..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్, టీజర్ విడుదల కానుంది. అయితే ఈ టీజర్ విషయంలో ఇప్పుడు హాట్ హాట్‌గా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?
పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని, తమిళ్‌లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారనేలా వార్తలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్‌లో ‘యానిమల్’ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఈ టీజర్‌కి వాయిస్ ఓవర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ చెప్పడానికి కారణం రష్మికా మందన్నా అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. రణ్‌బీర్ ‘యానిమల్’ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చనువుతో విజయ్ దేవరకొండకు సపోర్ట్‌గా బాలీవుడ్‌లో రష్మికా మందన్నా ఈ టీజర్‌కు రణ్‌బీర్‌ను వాయిస్ ఓవర్‌కి ఒప్పించినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల మధ్య ఉన్న స్నేహం గురించి తెలియంది కాదు. రీసెంట్‌గా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా వార్తలు రావడం, ఆ వార్తలు వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ పలు చోట్ల కలిసి కనిపించడంతో అంతా నిజమే అని అనుకుంటున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది పక్కన పెడితే.. విజయ్ దేవరకొండకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. అర్జెంట్‌గా విజయ్‌కి హిట్ కావాలి. అందుకే తన ఫ్రెండ్ కోసం రష్మిక ప్రొఫెషనల్‌గానూ రష్మిక సపోర్ట్ చేస్తుందనేలా చర్చలు నడుస్తున్నాయి.