Mega Hero: వైష్ణవ్ తేజ్ ఎందుకు వెనకపడ్డాడు...

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:56 PM

తొలి చిత్రం 'ఉప్పెన'తో వంద కోట్ల క్లబ్ లో చేరాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలను పొందాడు. దాంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ కు దక్కని అరుదైన అదృష్టం చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కు దక్కింది. హీరోగా నటించిన తొలి చిత్రంతోనే అతను వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' (Uppena) ఘన విజయాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ సినిమా వైష్ణవ్ తేజ్ కు మాత్రమే మొదటిది కాదు... హీరోయిన్ కృతీశెట్టి (Krithi Shetty) కి కూడా తెలుగులో అదే తొలి చిత్రం. అలానే ఆ సినిమాతోనే సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు (Sana Buchi Babu) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అందులో కీలక పాత్ర పోషించాడు. ఓ క్యూట్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా టేకిల్ చేసి బుచ్చిబాబు భారీ విజయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు అందించాడు. ఆ సినిమా సాధించిన విజయం వెనుక వెనుక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) కృషి కూడా ఉంది.


ఈ సినిమా తర్వాత సానా బుచ్చిబాబు కు స్టార్ హీరోల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయి. ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్న బుచ్చిబాబు... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలానే కృతిశెట్టి సైతం తనకొచ్చిన ఆఫర్స్ ను జాగ్రత్తగా గమనించి అంగీకరించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఛాన్సులు దక్కించుకుంది. ఒక్కసారి తారాపథంలోకి వెళ్ళి కృతిశెట్టి... ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. ఇదిలా ఉంటే... హీరో వైష్ణవ్ తేజ్ ది వేరే కథ. 'ఉప్పెన' తర్వాత వరుసగా ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ సాధించాడు తను. క్రిష్ డైరెక్షన్ లో చేసిన 'కొండపొలం' (Kondapolam) ఆ తర్వాత చేసిన 'రంగరంగ వైభవంగా', దాని తర్వాత నటించిన 'ఆదికేశవ' (Adikesava) చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో తన కథల ఎంపికలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నానని వైష్ణవ్ తేజ్ గుర్తించాడు. దాంతో మరింత జాగ్రత్త వహించడం మొదలెట్టాడు.


ఫిల్మ్ నగర్ చెబుతున్న సమాచారం ఏమిటంటే... గడిచిన రెండు సంవత్సరాలలో వైష్ణవ్ తేజ్ ఏకంగా వంద స్క్రిప్ట్ ను రిజక్ట్ చేశాడట. ప్రతి వారం యువ దర్శకులు అతనికి, అతని బృందానికి కథలు చెబుతూనే ఉన్నారని, కానీ ఏదీ వైష్ణవ్ తేజ్ ను ఆకట్టుకోవడం లేదని అంటున్నారు. అలానే మూడు పరాజయాలను మూటగట్టుకున్న వైష్ణవ్ తేజ్ తో సినిమా నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలు ఇప్పటికీ ఆసక్తిని కనబరుస్తున్నాయట. వాటి ద్వారా వచ్చిన కథలను సైతం... నచ్చకపోవడంతో వైష్ణవ్ తేజ్ తిరస్కరించాడట. ఆసక్తి కలిగించని స్క్రిప్ట్ ను టేకప్ చేయడం కంటే ఖాళీగా ఉంటేనే మంచిదని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ లెక్కన వైష్ణవ్ తేజ్ ను మెప్పించే కథను ఎవరు చెబుతారో, దానిని ఎవరు నిర్మిస్తారో చూడాలి.

Also Read: Tollywood: తెలుగు చిత్రసీమలో తారాజువ్వ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 26 , 2025 | 12:56 PM