నిన్న బాబాయ్ తో... నేడు అబ్బాయ్ తో రౌతేలా రొమాన్స్!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:34 PM

తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరమే ఏకంగా నాలుగు చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసి సంచలనం సృష్టించింది ఊర్వశీ రౌతేలా. అంతేకాదు... 'డాకు మహారాజ్' తో సంచలనతారగా పేరుతెచ్చుకున్న ఊర్వశీ రౌతేలా త్వరలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో చేయబోతోంది.

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) పేరు మీడియాలో మారు మ్రోగిపోతోంది. దానికి తగ్గట్టు ఆదివారం దుబాయ్ లో జరిగిన ఇండియా - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కు కూడా ఊర్వశీ రౌతేలా హాజరై హంగామా సృష్టించింది. నిజానికి ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ లోకి 2023లో అడుగు పెట్టిన ఏడాదే 'వాల్తేర్ వీరయ్య' (Waltair veerayya) తో పాటు 'ఏజెంట్'(Agent), 'బ్రో' (Bro), 'స్కంద' (Skanda) మూవీస్ లో స్పెషల్ సాంగ్ లో నర్తించి భారీ ఎత్తున సందడి చేసేసింది. అయితే అప్పటికే ఆమె 'బ్లాక్ రోజ్' అనే ద్విభాషా చిత్రం (తెలుగు, హిందీ)లో హీరోయిన్ గా నటించింది కానీ అదింకా విడుదలకు నోచుకోలేదు.


ఇక బాలకృష్ణ సరసన ఏ ముహూర్తాన ఊర్వశీ రౌతేలా 'డాకు మహరాజ్' (Daaku Maharaaj) లో నటించిందో కానీ ఆమె ప్రతి కదలిక అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. ఆమెతో కలిసి బాలకృష్ణ వేసి స్పెప్పులు సోషల్ మీడియాలో పాజిటివ్ గానూ నెగెటివ్ గానూ కూడా వైరల్ అయ్యాయి. దానికి తోడు ఇటీవల ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాగానే... ఆమె సన్నివేశాలను, పాటను తొలగించారనే ప్రచారం జరిగిపోయింది. కానీ అందులో నిజం లేదని తెలిసింది. అయితే... ఓటీటీలో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కాగానే ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టేస్తున్నారు.


ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) - ప్రశాంత్ నీల్ (Prasanth Neel) మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదలెట్టాడు. అందులో ఊర్వశీ నటిస్తోందని, వచ్చే షెడ్యూల్ లో ఆమె జాయిన్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్ట్ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మాస్ మూవీలో ఎన్టీయార్ సరసన రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) నటిస్తోంది. అలానే మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే యేడాది జనవరి 9న రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. విశేషం ఏమంటే... 'వాల్తేర్ వీరయ్య, డాకు మహారాజ్' తర్వాత ఊర్వశీ రౌతేలాకు ఇది మూడో సంక్రాంతి మూవీ అవుతుంది.

Updated Date - Feb 24 , 2025 | 03:38 PM