New Age Love story: టుక్ టుక్ అంటూ వచ్చేస్తోంది...
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:52 PM
యంత్రాలకు ప్రాణం ఉండవని సైన్స్ చెబుతుంది కానీ వాటిని కూడా ప్రేమించే వ్యక్తులు ఉంటారు. అలాంటి ఓ ప్రేమకథతో రూపుదిద్దుకుంది 'టుక్ టుక్' మూవీ!
వైవిధ్యమైన కథాంశాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టకడతారు. కాకపోతే వాళ్ళు కోరుకునే వినోదానికి అందులో కాస్తంత చోటుండాలి అంతే. అలాంటి సినిమాలను స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా సక్సెస్ చేస్తుంటారు కూడా. తమదీ అలాంటి సినిమానే అంటున్నారు 'టుక్ టుక్' (Tuk Tuk) మేకర్స్. హర్ష రోషన్ (Harsha Roshan), కార్తికేయ దేవ్ (Karthikeya Dev), స్టీవెన్ మధు, సాన్వీ మేఘన (Saanvi Meghana), నిహాల్ కోదాటి (Nihal Kodhaty) ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సి. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించారు.
'టుక్ టుక్' మూవీ గురించి దర్శకుడు సుప్రీత్ మాట్లాడుతూ, ''ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ప్రతి సన్నివేశం ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా స్కూటర్ కమ్ ఆటో ఎన్నో మ్యాజికల్ పవర్స్ కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంది. దానిని ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ వే లో చూపించబోతున్నాం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మార్చి 21న ఇది జనం ముందుకు వస్తుంది. మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అని అన్నారు. సంతు ఓంకార్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.