Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:32 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో చేసిన సినిమాలతో దాదాపు రూ. 100 కోట్లు నష్టపోయానని అన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన సదరు నిర్మాత సంచలన విషయాలను మీడియాకు తెలిపారు. ఇంతకీ ఎవరా నిర్మాత? ఏంటా సంచలన విషయాలు అంటే..
ఈ మధ్యకాలంలో సినిమాలు ఏళ్లకు ఏళ్లు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి అయితే.. సినిమా మొత్తం పూర్తయ్యే సరికి ఆ బడ్జెట్‌కు 10 రెట్లు ఖర్చు అవుతుంది. దీంతో నిర్మాతల్లో ఆ పెట్టిన పెట్టుబడి వస్తుందో? రాదో? అనే ఆందోళన మొదలవుతుంది. పైకి కనిపించనీయడం లేదు కానీ.. చాలా మంది నిర్మాతలది ఇదే పరిస్థితి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి సరిపోయింది.. లేదంటే టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి వేరేలా ఉండేది. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా.. నిర్మాతను నిట్టనిలువునా ముంచేసింది. అక్కడ లోపం ఎవరిదనేది పక్కన పెడితే.. ఇలా ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీయడం వల్ల నిర్మాత ప్రశాంతంగా ఉండలేడనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితులనే ఫేస్ చేసిన ఓ నిర్మాత.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి.. స్టార్ హీరోలతో చేసిన సినిమాల కారణంగా తనకు రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించారు. ఆ నిర్మాత మరెవరో కాదు.. శింగనమల రమేష్ బాబు.
Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్
శింగనమల రమేష్ బాబు.. ఈ పేరు ఇప్పుడున్న వారికి పెద్దగా తెలియదేమో కానీ.. ఒకప్పుడు స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో వరుస సినిమాలు ప్రకటించి.. ఒక్కసారిగా వార్తలలో నిలిచారు. అయితే ఆ రెండు సినిమాల కారణంగానే ఆయన తీవ్రంగా నష్టపోయినట్లుగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ‘కొమురం పులి’, మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. 2010లో క్రేజీ కాంబినేషన్స్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మాతకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఈ రెండు సినిమాలకూ నిర్మాత శింగనమల రమేష్ బాబు. ఈ రెండు సినిమాలతో తనకు దాదాపు రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని, అప్పుడు కనీసం తనని పట్టించుకున్నవారు లేరని మీడియా ముందు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ కేసులో 75 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే బెయిల్‌పై విడుదలైన శింగనమల రమేష్ బాబు.. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తెలిపేందుకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసలు జైలుకి వెళ్లడానికి కారణం ఏమిటని అడిగితే.. ‘‘మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మినట్లుగా.. అలా రూ.14 కోట్లు మోసం చేశాననేలా కొందరు నాపై కేసు పెట్టారు. సుదీర్ఘ న్యాయ విచారణ అనంతరం.. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. వారు ఏవైతే ఆస్తులు చెప్పారో.. ఇప్పటికీ అవి నా పేరు మీదే ఉన్నాయని తెలిపిన నిర్మాత శింగనమల రమేష్ బాబు.. ‘తను జైలులో ఉన్నప్పుడు ఏ ఒక్క హీరో కూడా తనని పట్టించుకోలేదని, కనీసం పలకరించలేదని’ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో చేసిన సినిమాలతో వచ్చిన నష్టం గురించి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో శంకర్, రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ కోసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ మూవీని మూడేళ్లు చిత్రీకరించారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఒక సినిమా ఆరు నెలల నుంచి ఒక ఏడాది లోపు పూర్తయ్యేది. నా ఫేట్, బ్యాడ్‌లక్ ఏంటంటే.. ‘కొమురం పులి, ఖలేజా’ సినిమాలకు మూడు సంవత్సరాల టైమ్ పట్టింది. ‘కొమరం పులి’ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండేవారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ‘ఖలేజా’ సినిమా కూడా పలు కారణాల వల్ల డిలే అయింది. ఒక సినిమాకు మూడేళ్ల పాటు మెయింటినెన్స్ ఎంత ఉంటుందనేది ఒక ప్రొడ్యూసర్‌కే తెలుస్తుంది. నాకు ఈ రెండు సినిమాలతో రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని రమేష్ బాబు తెలిపారు.
Also Read- Pushpa 2: 'పుష్ప రాజ్'కు దాసోహం అంటున్న హాలీవుడ్
భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతూ.. ‘‘మొదటి నుండి నేను ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. నాకు ఉన్న అభిరుచి కారణంగా నిర్మాతగా మారాను. సినిమా అనేది నాకు తల్లి లాంటిది. భవిష్యత్‌లోనూ సినిమా రంగంలోనే కొనసాగుతాను. నాకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ హీరోలుగా చేసి, విజయాన్ని అందుకున్నారు. భవిష్యత్‌లో వారిద్దరూ దర్శకరంగంలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కొనసాగాలని అనుకుంటున్నాను.. అది చెప్పేందుకే ఈ మీడియా సమావేశమని ఈ స్టార్ ప్రొడ్యూసర్ వెల్లడించారు.