Thandel Ticket Price: ‘తండేల్’కు ఏపీలో టికెట్ల ధర పెంపు.. ఎంతంటే?
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:41 PM
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ‘తండేల్’కు కూడా ఆ అవకాశమిచ్చింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ‘తండేల్’ టికెట్ల ధరలపై ఎంత పెంచారంటే..
‘తండేల్’ టీమ్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాములుగా అయితే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతినిస్తూ వస్తున్నాయి. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం కరాఖండీగా చెప్పేసింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన చివరి చిత్రం ‘గేమ్ చేంజర్’. ఆ సినిమాకు కూడా కోర్టు జోక్యం చేసుకోవడంతో.. మధ్యలోనే టికెట్ల ధరలను నార్మల్ చేసేశారు. ఇకపై తెలంగాణలో టికెట్ల పెంచుకోవడం గానీ, బెనిఫిట్ షోలకు అనుమతిగానీ ఉండదంటూ ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చింది. కానీ ఏపీలో మాత్రం సినిమా ఇండస్ట్రీకి అక్కడి ప్రభుత్వం సపోర్టివ్‌గానే ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు ‘తండేల్’ సినిమాతో మరోసారి రుజువైంది.
Also Read- Jr NTR: అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్..
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం స్పెషల్ జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ‘తండేల్’ సినిమాకు సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ. 50, మల్టీప్టెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ. 75 పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. సినిమా రిలీజైన వారం రోజుల పాటు ఈ ధరలు కొనసాగుతాయని జీవోలో పేర్కొంది. దీంతో ‘తండేల్’ టీమ్ ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read- Aaradhya Bachchan: ఆ కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల కుమార్తె..
‘తండేల్’ విషయానికి వస్తే.. ‘లవ్ స్టోరి’ తర్వాత చైతూ, సాయిపల్లవి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ‘కార్తికేయ’ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.