Thandel Piracy: చట్ట విరుద్థం అంటూ నిర్మాత ఫైర్
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:23 PM
‘తండేల్’ సినిమాను ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు (bunny vasu) స్పందించారు. ఆ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు.
గత శుక్రవారం విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘తండేల్’ (Thandel) చిత్రాన్ని పైరసీ భూతం (Thandep Pirated copy) వెంటాడుతోంది. విడుదలైన రోజు నుంచే పైరసీ ఈ సినిమాను వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు (bunny vasu) స్పందించారు. ఆ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు.
‘‘సోషల్ మీడియాలో వచ్చిన వార్త ద్వారా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో తండేల్‌ను (Thandel movie in APSRTC) ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇది చట్ట విరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమే. ఒక సినిమా ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకనిర్మాతల కల. దీనికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైౖర్మన్ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నాగచైతన్య(Naga chaitanya), సాయిపల్లవి (Sai pallavi) ప్రధాన పాత్రధారులుగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. దీన్ని పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో అది సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇటీవల ఓ లోకల్ ఛానల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీని గురించి నిర్మాత బన్నివాసు ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘‘సినిమా పైరసీ వస్తుంది.. చూసేద్దామని చాలామంది అనుకుంటుంటారు. ‘గీత గోవిందం’ సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్’ సినిమాలను పైరసీ చేసినవారిని, వాటిని డౌన్‌లోడ్ చేసుకొని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.