Progress Report: ఫిబ్రవరి మాసం 'తండేల్' చిత్రానిదే!

ABN , Publish Date - Mar 01 , 2025 | 10:20 AM

ఫిబ్రవరి నెలలో డబ్బింగ్ సినిమాలతో కలిసి 23 చిత్రాలు జనం ముందుకు వస్తే... అందులో 'తండేల్' మాత్రమే మంచి విజయాన్ని అందుకుని వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది.

కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో 23 సినిమాలు విడుదలైతే... ఫిబ్రవరి నెలలోనూ అనే చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జనవరిలో పదిహేను స్ట్రయిట్ మూవీస్, ఎనిమిది అనువాద చిత్రాలు వచ్చాయి. బట్ ఫిబ్రవరికి వచ్చేసరికీ అనువాద చిత్రాలు ఆరు మాత్రమే వచ్చాయి. ఇందులో అజిత్ (Ajith) 'పట్టుదల' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలానే చివరి వారంలో వచ్చిన ఆది పినిశెట్టి (Adi Pinisetty) 'శబ్దం', జీవా (Jeeva) 'అగత్యా' తమ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. విశేషంగా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganath) నటించిన అనువాద చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్', ధనుష్ (Dhanush) దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంతకోపమా' ఫర్వాలేదనిపించాయి. ఆంగ్ల అనువాద చిత్రం 'కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్' సైతం తెలుగు వారిని ఏమంతగా ఆకట్టుకోలేదు.


ఫిబ్రవరి మాసంలో విడుదలైన అనువాద చిత్రాల కథ ఇలా ఉంటే... జనం ముందుకు వచ్చిన 17 స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో కేవలం 'తండేల్' (Thandel) మాత్రమే తన సత్తాను చాటింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా తొలిసారి నాగచైతన్య (Naga chaitanya) ను వంద కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్ళింది. ఉత్తరాంధ్ర జాలర్ల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా, చందు మొండేటి దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయికగా చేసింది. ఇటీవల శివరాత్రి కానుకగా ఈ సినిమాలోని అర్థనారీశ్వర తత్త్వాన్ని తెలిపే పూర్తి వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సమకూర్చిన సంగీతం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. పలుమార్లు వాయిదా పడిన 'తండేల్'కు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోయినా... ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలలో ఇదే బెటర్ మూవీ అనిపించుకుంది. దాంతో వంద కోట్ల క్లబ్ లో మొదటి వారంలోనే ఈ సినిమా చేరిపోయింది.


ఇక ఇదే నెలలో వచ్చిన సాయిశంకర్ 'ఒక పథకం ప్రకారం', విశ్వక్ సేన్ 'లైలా', బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ నటించిన 'బ్రహ్మా ఆనందం', బ్రహ్మాజీ 'బాపు', ధన్ రాజ్ 'రామం రాఘవం' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి మాసాంతంలో వచ్చిన సందీప్ కిషన్ 'మజాకా' (Mazaka) , మిధున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి 'నేనెక్కడున్నా' కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. మొత్తం మీద ఈ నెలలో 23 చిత్రాలు విడుదలైతే... 'తండేల్' మాత్రమే బాక్సాఫీస్ బరిలో దూళ్ళకొట్టేసింది.

Also Read: Suzhal : The Vortex: పట్టు సడలిన 'సుళల్ - సీజన్ - 2'

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 11:55 AM