Telangana: ‘డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’.. బ్యాడ్ న్యూస్
ABN , Publish Date - Jan 10 , 2025 | 07:24 PM
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షో విషయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేపట్టింది. ఈ సవరణలతో నందమూరి ఫ్యాన్స్, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ సమరణలు ఏమిటంటే..
సంధ్య థియేటర్ ఘటన అనంతరం తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరకు రావద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా.. సంక్రాంతి సినిమాల విషయంలో మాత్రం కాస్త దయ దలచి.. మొదటి రోజు 6 షోలకు, రెండో రోజు నుండి 5 షోలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ‘గేమ్ చేంజర్’ సినిమాకు తెలంగాణలో 6 షోలు పడ్డాయి. అలాగే టికెట్ల ధరను పెంచుకునే విషయంలోనూ వెసులు బాటు కల్పించింది. అయితే.. బెనిఫిట్ షో లు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో.. అదనపు షోల విషయంలో ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలతో ‘డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే లేకపోలేదు. విషయంలోకి వస్తే..
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 తర్వాత తెల్లవారు జామున 4 గంటల షోలకు అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం సవరణలు చేపట్టింది. రోజుకు 5 షోలకు మించకుండా, అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చని అనుమతులు జారీ చేసింది. దీంతో 12న విడుదలయ్యే ‘డాకు మహారాజ్’, జనవరి 14న వచ్చే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాల అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం వసూళ్లపై ఉంటుందని వారు భావిస్తున్నారు. వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉండటంతో పాటు బడ్జెట్ కూడా చాలా తక్కువ కాబట్టి గట్టెక్కెస్తుంది. కానీ ‘డాకు మహారాజ్’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అర్థంకాకుండా తయారైంది. బాలయ్య ఈ సినిమాను ఎలా భుజాలపై మోసుకొస్తాడో అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇలా ఎంత అనుకున్నా.. ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే.. బాలయ్యని ఆపడం మిగతా సంక్రాంతి హీరోల వల్ల కానే కాదనేలా నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే..
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇచ్చిన జీవోపై శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టింది. ముఖ్యంగా ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెనిఫిట్ షో లు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున:సమక్షించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది.