TFCC: ఫిబ్రవరి 6.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:44 PM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజును తెలుగు సినిమా దినోత్సవంగా జరపాలని, ఆ రోజు నటీనటులు వారి ఇళ్లపైన, అలాగే రాష్ట్రంలోని థియేటర్లపైన జెండా ఎగురవేయాలనేలా కొన్ని మార్గదర్శకాలను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. ఈ మేరకు గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీని తెలుగు సినిమా దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని, అలాగే ఛాంబర్ తరఫున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకు అవార్డులు, పద్మ ఇంకా ఇతర అవార్డులు పొందిన వారందరినీ సన్మానించాలనేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా పుట్టిన రోజుగా ఇకపై గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నట్లుగా తెలుపుతూ.. ఆ రోజున ప్రతి నటీనటుడి ఇంటిపైన, అలాగే రాష్ట్రంలోని థియేటర్లపైనా జెండా ఎగురవేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజుకు సంబంధించిన జెండా రూపకల్పన బాధ్యతను సీనియర్ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖులు పాల్గొని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో..
Also Read- Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..
ఫిబ్రవరి 6ను తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున తెలుగు సినిమా దినోత్సవంగా చేయనున్నాము. ఈ ఏడాది సింపుల్‌గా ప్రారంభించి, ప్రతి ఏడాది ఘనంగా చేయదలిచాము. తెలుగు సినిమా పుట్టుకను రాబోయే తరాలకు కూడా గుర్తుండేలా చేయాలన్నదే మా ప్రయత్నం. తెలుగు సినిమా చరిత్ర రాబోయే తరాలకు తెలియాలనే తెలుగు సినిమా దినోత్సవం జరపుతున్నాము. వచ్చే ఏడాది నుంచి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయటంతో పాటు.. ఆ ఏడాది ప్రతిభావంతులకు, పద్మ అవార్డ్ గ్రహీతలను సన్మానించే పరిశీలన చేస్తున్నాము. గద్దర్ అవార్డ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రొ యాక్టివ్‌గా ఉంది. సినిమా ఇండస్ట్రీ గురించి, వ్యక్తుల గురించి తక్కువ చేసి మాట్లాడే వారిని ఎప్పటికప్పుడు ఛాంబర్ కట్టడి చేస్తూనే ఉంది. వివాదాస్పద కామెంట్స్ చేసే వారు తామెంటో కూడా చూసుకోవాలి. -దామోదర్ ప్రసాద్
‘భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజే (ఫిబ్రవరి 6) తెలుగు సినిమా పుట్టిన రోజు. తమిళ వాళ్లు మాది అని చెప్పుకునే ‘కాళిదాసు’ మన తెలుగు సినిమానే. హిందీ తొలి సినిమా ‘ఆలం ఆరా’, తెలుగు వారి ‘భక్త ప్రహ్లాద’, తమిళ వారి ‘కాళిదాసు’ ఇలా అన్నీ సినిమాల్లో ఎల్ వి ప్రసాద్ యాక్ట్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లలా తెలుగు సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించారు. సినిమా వారంతా గర్వపడే రోజు ఇది. - ప్రసన్నకుమార్
ఎప్పటి నుంచో మనం చెసుకోవాల్సిన పండుగ ఇది. ఏఎన్నార్ గారు తమ టైమ్‌లో కాంపిటేషన్ ఎక్కువగా ఉండేదని.. అవమానాలు పడి ఓ మార్గం వేసినట్లు చెప్పేవారు. మన ఎల్.వి.ప్రసాద్ గారు తెలుగు సినిమాకు ఆద్యుడు. ఇవాళ రాజకీయ నాయకుల కంటే సినిమా వారే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఫిబ్రవరి 6ను ప్రతి ఏడాది తెలుగు సినిమా దినోత్సవంగా గ్రాండ్‌గా జరపనున్నాం. 1973లో నన్ను అట్లూరి పూర్ణచంద్రరావు పరిచయం చేశారు. వారు సినిమా రిప్రజంటేటివ్‌గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.- మురళీమోహన్
1913లో మూకీ సినిమా హెచ్ ఎం రెడ్డి గారిది రిలీజైంది. కానీ దాన్ని మనం తెలుగు సినిమాగా చెప్పుకోలేము కాబట్టి. ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6 డేట్‌ను తెలుగు సినిమా దినోత్సవం పరిగణిస్తున్నాము. - పరుచూరి గోపాలకృష్ణ
Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..
గొప్ప నటులు, టెక్నిషియన్స్ తెలుగు సినిమాను గొప్ప స్థాయికి తీసుకువచ్చారు. తెలుగు సినిమా ఈ రోజు ప్రపంచ సినిమా అయింది. నాటి ఎన్టీఆర్‌గారి మొదలు ఆ తర్వాత వచ్చిన వారంతా ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. తెలుగు సినిమా రజింపచేయటంతో పాటు, ఆలోచింపజేయటంతో పాటు, చైతన్యవంతం చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తాము. - మాదాల రవి (మా వైస్ ప్రెసిడెంట్)
తెలుగు సినిమా పరిశ్రమ పండుగ కోసం మా దర్శకుల సంఘం తరపున ఏం చేయమంటే అది చేస్తాం. తెలుగు మాటలు వినిపించింది ‘కాళిదాసు’ చిత్రం. నాలుగు రీల్స్‌లో తెలుగు డైలాగ్స్ ఉంటాయి. కానీ దాన్ని తమిళులు ఓన్ చేసుకున్నారు. అక్టోబర్ 31 రిలీజైంది. దాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి. సినిమా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. సినిమాని, సినిమా వాళ్లని తక్కువ చేసి మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి కృషిచేయాలి.- వీరశంకర్ (దర్శకుల సంఘం అధ్యక్షుడు)