తెలంగాణాలో మల్టీప్లెక్స్‌లకు ఊరట

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:14 PM

తెలంగాణాలోని మల్టీప్లెక్స్‌ (TGS Multiflex Theaters) ఊరట కల్పిస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను (Green signel to kids) కూడా అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది.

తెలంగాణాలోని మల్టీప్లెక్స్‌ (TGS Multiflex Theaters) ఊరట కల్పిస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను (Green signel to kids) కూడా అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది. ఈమేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ విషయంపై అన్నివర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈక్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్‌ యాజమాన్యం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన అంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ 16ఏళ్ల లోపు పిల్లలని థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది.

Updated Date - Mar 01 , 2025 | 04:21 PM