Tollywood: ఈసారి సీఎంతో భేటీలో చర్చకు వచ్చే అంశాలు ఇవేనా?
ABN , Publish Date - Jan 01 , 2025 | 10:32 PM
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినీ హబ్‌గా మార్చేందుకు తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం రేవంత్ కోరడంతో.. ఆయన ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ప్రతిపాదనలను ఇండస్ట్రీ తరపు పెద్దలు రెడీ చేశారని తెలుస్తోంది. అందులో..
తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మరోసారి సినీ ప్రముఖుల భేటీ ఉంటుందని రీసెంట్‌గా కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరిగిన భేటీలో FDC ఛైర్మన్ దిల్ రాజు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి.. సినిమా హబ్‌గా హైదరాబాద్ రూపాంతరం చెందాలంటే ఏం అవసరమో, ప్రతిపాదనల రూపంలో తన ముందుకు తీసుకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరారని దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు టాలీవుడ్ నుంచి ఏయే అంశాలకు ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లతారనే విషయంపై చర్చ మొదలైంది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ సెన్సార్ పూర్తి.. సర్టిఫికేట్ ఏం వచ్చిందో తెలుసా..
అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లేందుకు దిల్ రాజు అధ్యక్షతన ఓ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో బ్లాక్ టికెటింగ్ దందాను ఆపేందుకు ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరనున్నారని సమాచారం. ఆన్‌లైన్ టికెటింగ్ ద్వారా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచనున్నారని, ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అన్ని ప్రాంతాల్లోనూ అమలయ్యేలా దశల వారీగా చర్యలు చేపట్టాలని, ఈ విధానం అమలుకై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వ పరిధిలోనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందనేలా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
దీనితో పాటు.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న అంశం, అలాగే హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా చేయడానికి ఏం చేయాలని సీఎం సినిమా వాళ్లని కోరిన సందర్భంగా.. ప్రపంచస్థాయి సినిమా సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం వైపు నుంచి వేల ఎకరాల భూమి ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచనున్నారని తెలుస్తోంది. వీటితో పాటు ఇటీవల జరిగిన సంధ్య థియేటర్స్ ఇన్సిడెంట్స్ మళ్లీ జరగకుండా చూసుకునేలా తగిన ఏర్పాట్లు, కొన్ని నియమ నిబంధనలతో స్టార్ హీరోల, భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల వెసులుబాటు ప్రస్తావనను ప్రభుత్వం ముందు ఉంచనున్నారనేలా టాక్ అయితే వినబడుతోంది. టాక్ వినిపించడమే కానీ.. అధికారిక సమాచారం అయితే ఈ విషయంపై ఎక్కడా రాలేదు. త్వరలోనే సీఎంతో రెండో సిట్టింగ్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది.