Super Yodha: ఏప్రిల్ నుండి ఆగస్ట్ 1కి 'మిరాయ్'
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:18 PM
తేజ సజ్జా హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని 'మిరాయ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
'హనుమాన్' మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. అతను హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ 'మిరాయ్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే విడుదలై, సినిమాపై అంచనాలను పెంచేసింది. 'మిరాయ్' సినిమాను ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. దాంతో ఏప్రిల్ 18న రాబోతున్న అనుష్క పాన్ ఇండియా మూవీ 'ఘాటీ'కి దారి వదిలినట్టు అయ్యింది.
అశోక చక్రవర్తి జీవితంలో కళింగ యుద్థం అనేది ఓ చెడ్డ గుర్తుగా మారిపోతుంది. ఆ ప్రశ్చాత్తాపంలోనే అతనికి దైవ రహస్యం వెల్లడవుతుంది. మనిషిని దైవంగా మార్చే తొమ్మిది గ్రంధాల అపార జ్ఞానం అతనికి లభిస్తుంది. దానిని రక్షించేందుకు తొమ్మిది మంది యోధులను నియమిస్తారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం పట్టినప్పుడు దానిని నిర్మూలించడానికి ఓ యోథుడు పుడతాడు. అతని కథే 'మిరాయ్'. బౌద్థ సన్యాసి నుండి వచ్చిన ఈ కథకు తగ్గట్టుగా 'మిరాయ్' అనే పేరును జపాన్ లిపికి దగ్గర పెట్టినట్టు మేకర్స్ తెలిపారు. ఇందులో సూపర్ యోధగా తేజ సజ్జ అద్భుతంగా నటించాడని మేకర్స్ తెలిపారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి గౌర హరి సంగీతం అందించాడు. ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇతర దేశ భాషాల్లోనూ 'మిరాయ్'ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.