Suriya - Chandoo: సూర్య కోసం రెండు కథలు.. ఏది ఫైనల్ అవుతుందో..
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:22 PM
తెలుగు దర్శకులతో పని చేయడానికి పర భాషా హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగు దర్శకుల మాయలో పడిపోయారు. ఇప్పుడు సూర్య (Suriya) వంతు వచ్చింది.
దేశమంతా ఇప్పుడు తెలుగు దర్శకుల (Tollywood Directors) వైపే చూస్తుంది. భారీ చిత్రాలు తీయడం, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లడం హిట్టు కొట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. తెలుగు దర్శకులతో పని చేయడానికి పర భాషా (Kollywood Heros) హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగు దర్శకుల మాయలో పడిపోయారు. ఇప్పుడు సూర్య (Suriya) వంతు వచ్చింది. తెలుగులో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు సూర్య. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లతో చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్‌లో బోయపాటి శ్రీను పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు చందూ మొండేటితో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు సూర్య. త్వరలోనే చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య (Suriya - Chandoo Mondeti Movie) కథానాయకుడిగా సినిమా పట్టాలెక్కడం ఖాయమనిపిస్తుంది.
ఈ విషయంపై దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ’’కార్తికేయ 2 సినిమా సూర్య గారికి బాగా నచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరం సినిమా చేద్దామని అవకాశం ఇచ్చారు. నేను ఆయనకు రెండు కథలు కూడా వినిపించాను. అవి రెండూ ఆయనకు నచ్చేశాయి. రెండింటిలో ఒకటి ఫైనల్ చేయాల్సివుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్‌తో రెట్రో, ఆర్‌జె బాలాజీతో సూర్య45, వెట్రిమారన్‌తో 'వాడివసల్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలా చూస్తే ఈ ఏడాదంతా సూర్య షెడ్యూల్ బిజీగానే ఉంది. వచ్చే ఏడాది చందూ మొండేటితో సినిమా ఉండొచ్చు.
ప్రస్తుతం చందూ ‘తండేల్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. తండేల్ తరవాత సూర్య సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత కార్తికేయ 2 ఉంటుందని తెలుస్తుంది.