SKN: ఉద్యమంలా చేస్తున్నా... విమర్శించకండి...

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:34 PM

ఎన్.కె.ఎన్. మీద కొందరు నెటిజన్స్ ఎదురుదాడికి దిగారు. మరికొందరైతే... 'బేబీ'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ను ఎస్.కె.ఎన్. హీరోయిన్ చేశాడని, కానీ ఆమెతో అతనికి చెడిందని ఊహాగానాలు చేశారు. ఈ వివాదంపై ఎట్టకేలకు ఎస్.కె.ఎన్. పెదివి విప్పాడు. తనవంతుగా వివరణ ఇచ్చాడు.

'బేబీ' (Baby) సినిమాతో నిర్మాతగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్.కె.ఎన్. (SKN). అంతకు ముందు కూడా దర్శకుడు మారుతీ (Maruthy) తో కలిసి పలు చిత్రాలను నిర్మించిన ఎస్.కె.ఎన్.కు 'బేబీ' స్టార్ ప్రొడ్యూసర్ హోదాను కట్టబెట్టింది. ఆ సినిమాకు లభించిన సక్సెస్ తో ఇప్పుడు మరిన్ని చిత్రాలను పట్టాలెక్కించాడు. బేసికల్ గా ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన ఎస్.కె.ఎన్. ఏ సినిమా వేడుకలో మాట్లాడినా... అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అలా ఆయా సినిమాలకు పరోక్షంగా బోలెడు పబ్లిసిటీ చేసి పెడుతుంటాడు ఎస్.కె.ఎన్. అంత్యప్రాసలతో ఎస్.కె.ఎన్. చెప్పే డైలాగ్స్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. చిన్న చమక్కుతో మాట్లాడి... ఆ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ కు ఎస్.కె.ఎన్. కారణం అవుతుంటాడు. ఇటీవల 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return of the dragon) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ''ఇక మీదట తాను, సాయి రాజేశ్‌ (Sai Rajesh) తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించమని, అలా చేయడం వల్ల తమకు గొప్ప గుణపాఠం లభించిందని మాట్లాడాడు. దానిని కొందరు విమర్శించారు. ఓ తెలుగు సినిమా జర్నలిస్టు, తెలుగు సినిమా నిర్మాత అయి ఉండి... తెలుగు ఆర్టిస్టులను ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను ఎలా కించపరుస్తావంటూ ఎన్.కె.ఎన్. మీద కొందరు నెటిజన్స్ ఎదురుదాడికి దిగారు. మరికొందరైతే... 'బేబీ'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ను ఎస్.కె.ఎన్. హీరోయిన్ చేశాడని, కానీ ఆమెతో అతనికి చెడిందని ఊహాగానాలు చేశారు. ఈ వివాదంపై ఎట్టకేలకు ఎస్.కె.ఎన్. పెదివి విప్పాడు. తనవంతుగా వివరణ ఇచ్చాడు.


'డ్రాగన్' ప్రెస్ మీట్ లో సరదాగా తాను చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్ గా తీసుకుని చిలువలు పలవలుగా ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. అంతేకాదు... జోక్ ను జోక్ గా తీసుకోవాలి తప్పితే... తన మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదంటూ వివరణ ఇచ్చాడు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం, ప్రోత్సహించడంలో తాను ముందుంటానని చెప్పాడు. ఇంతవరకూ తెలుగులో తాము నిర్మించిన పలు చిత్రాల ద్వారా రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత పరిచయం అయ్యారని, అలానే కొత్త సినిమా ద్వారా హారిక అనే అమ్మాయిని పరిచయం చేస్తున్నట్టు ఎస్.కె.ఎన్. తెలిపాడు. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈషా రెబ్బ, ప్రియా వడ్లమాని, హిమజా, ఇనయా వంటి వారినీ తాను ప్రోత్సహించానని వివరణ ఇచ్చాడు. తన కెరీర్ లో ఎనభై శాతం తెలుగు అమ్మాయిలతోనే వర్క్ చేశానని, తెలుగు సినిమా రంగంలోని వివిధ శాఖలలో కనీసం 25 మందిని పరిచయం చేయాలన్నది తన టార్గెట్ అని ఎస్.కె.ఎన్. చెప్పాడు. ఓ ఉద్యమంలా తాను తెలుగు వారిని ప్రోత్సహిస్తున్నానని, దానిని అర్థం చేసుకుని సహకరించాలి కానీ ఇలా విమర్శించడం సబబు కాదని ఎస్.కె.ఎన్. ఆ వీడియో ద్వారా కోరాడు. తాను నిర్మిస్తున్న కొత్త చిత్రాల ద్వారా ఆర్ట్ డైరెక్టర్ గా, రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇచ్చానని చెప్పాడు. ఎప్పటికీ తన తొలి ప్రాధాన్యం తెలుగు అమ్మాయిలకే అని స్పష్టం చేశాడు ఎస్.కె.ఎన్. అయితే... తరచూ తన వ్యాఖ్యాలతో వార్తలలో నానుతూ ఉండే ఎస్.కె.ఎన్. కాంట్రవర్శీ కోసమే 'డ్రాగన్' ఫంక్షన్ లో అలా మాట్లాడాడని, అతను కోరుకున్నదే జరిగిందని అంటున్నవారూ లేకపోలేదు.

Updated Date - Feb 18 , 2025 | 04:34 PM