SVR-Bunny: ఆర్యా సుక్కూ.. ఎంత దారుణమైన పోలిక ఇది..
ABN , Publish Date - Feb 09 , 2025 | 02:48 PM
పుష్ప 2 థాంక్స్ మీట్ లో సుకుమార్, బన్నీ ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఓ సందర్భంలో సుకుమార్ బన్నీని ‘ఎస్వీఆర్’తో పొల్చాడు. ఇది ఆయన మాట కాదు.
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరో వర్షిప్ (Hero Worship) ఇండస్ట్రీనే. హీరోలనే డెమీ గాడ్స్‌లా చూస్తారు. దర్శకనిర్మాతల నుంచి లైట్ బాయ్ దాకా హీరో భజన చేయాల్సిందే. అది హీరోపై ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పక భజన చేయాల్సి వస్తుంటుంది. నిజంగా హీరోని ఇష్టపడే దర్శకనిర్మాతలు చాలా మందే ఉంటారు. అతిగా ప్రేమించవచ్చు. అదే హీరోతో వరుస చిత్రాలు చేయవచ్చు. వీటి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. అభ్యంతరాలు కూడా ఉండవు. అది వారిష్టం. కానీ పోలిక విషయం వచ్చేసరికి కొన్ని హద్దులుంటాయి. ఓ హీరోతో మరొకర్ని, అందులోనూ లెజెండరీ పర్సనాలిటీని పోల్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి(Bad Comparison). ఆ విషయంలో లెక్కల మాస్టర్ సుకుమార్ కాస్త హద్దు దాటరనే చెప్పాలి.
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్‌ల (Sukumar) బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్యతో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చారు సుక్కూ. అక్కడ మొదలైన వీరిద్దరి మైత్రి బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఒకరు లేకుండా మరొకరి కెరీర్ లేదు. పుష్పతో బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీనంతటికీ దర్శకుడు సుకుమారే కారణం. ఇద్దరూ వీలైనప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని హద్దు లేకుండా ప్రకటించుకొంటారు. అది తప్పేం కాదు. దానికి అభిమానులు ఎంతో సంతోషిస్తారు.
సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ‘పుష్ప 2’ (Pushpa-2) థ్యాంక్స్ మీట్‌ను చిత్ర బృందం సమక్షంలో నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో సినిమా లైట్ బాయ్ నుంచి హీరో వరకూ సక్సెస్ షీల్డ్‌లను అందించారు. ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఓ సందర్భంలో సుకుమార్ బన్నీని ‘ఎస్వీఆర్’తో పొల్చాడు. ఇది ఆయన మాట కాదు. సినిమా చూసిన అభిమానులో ఎవరో అన్న మాట. బన్నీ నటన చూశాక 'ఎస్వీ రంగారావు గుర్తొచ్చారు(SVR).. మళ్లీ ఎస్వీఆర్ వచ్చారనిపించింది’ అని ఆ వ్యక్తి అన్నాడని సుకుమార్ చెప్పారు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి ‘ఎస్వీఆర్ బన్నీలా డాన్సులు, ఫైటింగులు చేయగలడా’ అని అన్నాడనీ సుక్కూ చెబుతూనే బన్నీ డాన్స్‌లు, ఫైట్‌లు, యాక్టింగ్ అన్ని చేశాడు.. ఏం తక్కువ అన్నట్లు చెప్పి.. ఎస్వీఆర్‌తో పోలికను సమర్ధించేలా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ పోలిక కరెక్ట్ కాదని ట్రోల్ చేస్తున్నారు. (Comparison with SV rangarao)
ఎస్వీఆర్ అల్లు అర్జున్.. మధ్యలో మూడు తరాలున్నాయి. ఎస్వీఆర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మాణిక్యం లాంటివారు. నటనకు రారాజ. ఆయన్ని ఆ రంగంలో కొట్టేవాడే లేడు. తెలుగు తెరకే కాదు భారతీయ చలన చిత్ర రంగంలోనే ఎస్వీఆర్‌ని కొట్టే ఆర్టిస్టు ఇప్పటి వరకూ పుట్టడు.. పుట్టబోడు అన్నది ఆ తరం నుంచి ఈ తరం వరకూ అందరూ చెప్పే మాట. అలాంటి ఎస్వీఆర్‌తో బన్నీని పోల్చడం ఏమాత్రం బాగాలేదని కామెంట్ చేస్తున్నారు. అభిమానులు సుకుమార్ దగ్గర ఈ విషయాన్ని సరిగ్గా సుకుమార్ చెప్పినట్టే ప్రస్తావించి, తమ అభిమానాన్ని చాటుకొని ఉండొచ్చు. కానీ.. దాన్ని సుకుమార్ మనసులోనే దాచుకోవాల్సింది. లాజిక్‌లకు కేరాఫ్ అయిన సుక్కూ ఆ మాటలు విని కాస్త ఆలోచించి ుఎస్వీఆర్ - బన్నీ.. పోలిక లేదు కదా’ అని మనసులోనే అనుకొని, దాన్ని అక్కడే ఉంచేసుకుని ఉంటే బావుండేది. దానిని వేదికపై చెప్పాడు. విన్న ఆ కాసేపు అల్లు అర్జున్‌ని, అభిమానుల్ని, ఆర్మీని సంతోష పరచవచ్చు కానీ అదే పోలిక గురించి మళ్లీ వింటే మాత్రం "ఎంత దారుణమైన పోలిక ఇది’ అనిపిస్తుంది. అల్లు అర్జున్ స్టార్ హీరో. మంచి నటుడు కూడా. తెలుగు సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ తీసుకొచ్చాడు. దాంతో నటుడిగా గౌరవం పెరిగింది. అతన్ని అలాగే ఉండనివ్వాలి. ఇలాంటి పోలికలతో ఆకాశానికి ఎత్తితే సమస్యేనని నెటజన్లు కామెంట్స్ చేస్తున్నారు.