SSMB29: రాజమౌళి - మహేశ్ మూవీ ఏది నిజం... ఏది అబద్దం
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:17 PM
మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రానేలేదు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో టెస్ట్ షూట్ చేశారనే వార్తలు వచ్చినా దానిని చిత్ర బృందం నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుందని అంటారు. జక్కన్న సినిమాకు ఇప్పుడదే జరుగుతోంది. ఆయన అసలు విషయం చెప్పకపోవడంతో గాసిప్ రాయుళ్లు రోజుకో కథ అల్లేస్తున్నారు. ఏది నిజమో, మరేది అబద్ధమో తెలియక అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. పైగా గ్లోబల్ ఇండస్ట్రీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఎస్.ఎస్.ఎం.బి. 29 (SSMB29). సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలిసి చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీ నుంచి నెలలు గడిచిపోతున్నా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వక పోవడంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. ఇది చాలదన్నట్టుగా సోషల్ మీడియాలో రోజుకో అప్ డేట్ సినిమా గురించి వస్తుండటంతో. అసలేం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు.
మహేష్‌బాబు ఏడాదిగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ షూట్ జరిగిందని అంటున్నారు. అందులో మహేశ్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొందనే ప్రచారమూ జరిగింది. బట్ ఈ విషయాలను రాజమౌళి అఫిషియల్‌గా ప్రకటించలేదు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలువుతుంది, ఎన్ని భాగాలుగా ఉంటుంది, ఎప్పుడు విడుదల అవుతుంది? అనే వివరాలు అధికారికంగా రాలేదు. నిజానికి సినిమాను ప్రారంభించినట్లు కూడా ఇప్పటి వరకు రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఎవరికి వారు తమకు నచ్చిన కథలను అల్లుతున్నారు.
ఆ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాను ప్రారంభించారని సమాచారం. ఇంకా అక్కడ షూటింగ్ జరుగుతుందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు. త్వరలో ఆఫ్రికాకు యూనిట్ సభ్యులు అంతా వెళ్లబోతున్నారని, అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధం అవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లే ముందు మీడియా ముందుకు రాజమౌళి అండ్ టీం వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే, రాజమౌళి గత సినిమాల షూటింగ్ సమయంలో, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో లీక్ సమస్య ఎదురుకావడంతో.. ఈసారి దానిని ఎదుర్కోవడానికి అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారట. బట్... రాజమౌళి ఎంత కష్టపడ్డా లీక్ మాత్రం ఆపలేకపోతున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ సెట్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'పాతకాలంలో కాశి నగరం ఇలా ఉండేది, ఆ సెట్‌లోనే సినిమా షూటింగ్ జరుగుతోంది' అంటూ ఆ ఫోటోలకు కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి వాటికి బ్రేక్ పడాలంటే రాజమౌళి రియాక్ట్ కావాల్సిందే!
Also Read: Unni Mukundan: 'మార్కో'కి సెన్సార్ బ్రేక్!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి