SSMB29: జక్కన్న సినిమా.. ఆ మాత్రం కండీషన్స్‌ ఉండాల్సిందే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 08:06 AM

మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా విషయంలో జక్కన చాలా పకడ్భందీగా ఉన్నారు. సెట్లో టీం కు గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్లు చిత్ర యూనిట్‌ నుంచి తెలిసింది..


మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ఇటీవల మొదలైన పంగతి తెలిసిందే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రాజమౌళి హీరో మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఓ వీడియోను షేర్‌ చేయడంతో  సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టినల్లు తెలుస్తోంది. జక్కన్న సినిమా అంటే సినిమాకు సంబంధించి ఒక్క లీక్‌ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్ట్‌ల గురించి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆ రకంగా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారు. కథ విషయంలో కూడా కథా రచయిత రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిందే తప్ప దర్శకుడిగా రాజమౌళి ఎక్కడా నోరు విప్పలేదు. జస్ట్‌ సినిమా జానర్‌ మాత్రం చెప్పారు. ఎంతో పకడ్భందీగా సినిమా మొదలుపెట్టారు. ఈ విషయంలో చిత్ర బృందానికి గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్లు చిత్ర యూనిట్‌ నుంచి తెలిసింది.. ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ చేయించినట్లు పలు ఇంగ్లిష్‌ మీడియా సంస్థలు కథనాలు రాశాయి.

 
దీని ప్రకారం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. దర్శక-నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్‌ చేసినా, బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలిసిందే. మరో రెండు మూడు చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్‌ను సిద్థం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల రాజమౌళి పాస్‌పోర్ట్‌ పోస్టుకు మీమ్స్‌, ఫన్నీ వీడియోలు విపరీతంగా నెటిజన్లను అలరిస్తున్నాయి.  

Updated Date - Jan 28 , 2025 | 08:06 AM