Game Changer: శంకర్ గారు ఆ హక్కులు నాకే చెందాలి.. రాజమౌళి
ABN , Publish Date - Jan 03 , 2025 | 09:01 AM
సినిమా వేదికలపై పొగడ్తల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోలను దర్శకనిర్మాతల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ హద్దుకు మించి పొగడ్తల వర్షంలో ముంచేస్తారు. కానీ హీరోని హీరోని మెచ్చుకోవడం, ఓ దర్శకుడి గురించి మరో టాప్ దర్శకుడు గొప్పగా చెప్పడంతో ఎప్పుడోగానీ జరగదు.
సినిమా వేదికలపై పొగడ్తల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోలను దర్శకనిర్మాతల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ హద్దుకు మించి పొగడ్తల వర్షంలో ముంచేస్తారు. కానీ హీరోని హీరోని మెచ్చుకోవడం, ఓ దర్శకుడి గురించి మరో టాప్ దర్శకుడు గొప్పగా చెప్పడంతో ఎప్పుడోగానీ జరగదు. వారి మధ్య మంచి స్నేహం, రాపో ఉంటే తప్ప ఓ దర్శకుడి గురించి గొప్ప మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి సీన్ గురువారం జరిగిన గేమ్ ఛేంజర్ (Game Changer) ట్రైలర్ ఆవిష్కరణలో కనిపించింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) , కోలీవుడ్ అగ్ర దర్శకుడు, భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన శంకర్‌ను (Shankar) పొగడ్తల్లో ముంచేశారు. అయితే అది అతిశయోక్తి అయితే లేదు.. శంకర్ టాలెంట్ తెలిసిన దర్శకుడిగా ఆయన మాట్లాడారు. ఇంతకీ జక్కన్న ఏమన్నారంటే.. ‘‘మనకున్న పెద్ద కలల్ని తెరపై ఆవిష్కరించే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. సినిమా అలా తీస్తేనే నేటి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మన పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మకాన్ని పెంచిన దర్శకుడు శంకర్. అప్పట్లో సహాయ దర్శకులుగా ఉన్న నాతో సహా ఎంతోమందికి ఆయర స్ఫూర్తి. మా అందరికీ ఆయన ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఆయన సినిమాల్లో నాకు ఇష్టమైన చిత్రం ‘ఒకే ఒక్కడు’. దానికి పదింతలు అలరించేలా ‘గేమ్ ఛేంజర్’ ఉంటుంది’’ అన్నారు గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘శంకర్ తీసిన తొలి తెలుగు సినిమా ఇదంటే నమ్మబుద్ధి కాలేదు. ఆయన తెలుగు ప్రేక్షకుల దృష్టిలో తెలుగు దర్శకుడే. ప్రేక్షకులకు శంకర్ అంటే అభిమానం మాత్రమే కాదు, గౌరవం కూడా. ఆ గౌరవంతోనే ఈ సినిమా చేశారని నమ్ముతున్నా. గత పదేళ్లుగా భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాం. ఆ విషయంలో ఈ తరం దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడితే, మాకు అలాంటి ఓ గొప్ప అనుభూతిని పంచిన దర్శకుడు శంకర్. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో ఒకప్పటి శంకర్ గుర్తొచ్చారు. ట్రైలర్‌లో ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం భలే ఉన్నాయనే అనుభూతి కలిగింది’’ అన్నారు.
ప్రత్యక్షంగా చూశా...
రామ్‌చరణ్ ఎదుగుదల గురించి చాలా మంది చెబుతుంటారు. నేనైతే ప్రత్యక్షంగా చూశా. ‘మగధీర’లో చూసిన చరణ్‌కీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చూసిన చరణ్‌కీ ఎంతో వ్యత్యాసం. మరో స్థాయికి వెళ్లిపోయాడు. తనని ‘మగధీర’ సినిమా జరిగినన్నాళ్లూ హీరో అనే పిలిచే వాడిని. తను ఈ స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్‌లో తను హెలికాప్టర్‌లో నుంచి కత్తి పట్టుకుని బయటికి దిగడం చూశాక, థియేటర్లలో సందడి ఎలా ఉంటుందో ఓ అంచనాకు వచ్చా. తను మాస్ సన్నివేశాల్నే కాదు, హృద్యమైన సన్నివేశాల్నీ, డ్యాన్సుల్నీ చాలా బాగా చేస్తాడు. తను గుర్రంపై చేేస సన్నివేశాలపై హక్కులు నాకే చెందాలి’’ అంటూ చమత్కరించారు.
రామ్‌చరణ్ (Ram Charan) మాట్లాడుతూ ‘‘దర్శకులు శంకర్, రాజమౌళి విషయాల్లో ఏదీ మనం ఊహించినట్టు ఉండదు. ఇద్దరూ ఏ విషయంలోనూ రాజీపడని దర్శకులు. తెర వెనక అందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంటారు. నటులకి నటించడానికి, సాంకేతిక బృందానికి ఉత్తమ ప్రతిభ బయటకు తీసుకు రావడానికి తగిన అవకాశం ఇస్తారు. ఇందులో పాటల స్థాయిని ఎంత ఊహించినా దానికి పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. మధురై ఎంపీ సు.వెంకటేశన్ సహా, చాలా మంది నిజాయతీగల అధికారులు రాజకీయ నాయకులు కలిసి, కొన్ని సన్నివేశాలు వాళ్లతో రాయించి దర్శకుడు శంకర్ ఈ సినిమాని చేశారు’’ అని అన్నారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు -శిరీష్ నిర్మించారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, సముద్రఖని, ఎస్.జె.సూర్య కీలక పాత్రధారులు. సంక్రాంతి పండగని పురస్కరించుకుని ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.