Dil Raju: తెల్ల కల్లు, మటన్.. సారీ చెప్పిన దిల్ రాజు

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:39 PM

ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా వైబ్ ఏపీ, తెలంగాణలలో ఎలా ఉంటుందో వివరించే క్రమంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం పెద్దది కాకుండా.. క్షమాపణలు కోరుతూ.. తాజాగా దిల్ రాజు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..

Dil Raju

విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రీసెంట్‌గా నిజామాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘సంక్రాంతి పండుగకు ఆంధ్రాలోలా తెలంగాణలో సినిమాలకు వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద తెలంగాణలో వైబ్స్ ఉంటాయి’ అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. దిల్ రాజు తెలంగాణ వాళ్లను అవమానించేలా మాట్లాడారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడంతో పాటు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తను చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో


‘‘నిజామాబాద్ పట్టణంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈవెంట్ చేశాం. మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పట్లో ‘ఫిదా’ సక్సెస్ మీట్ పెట్టాను. నిజామాబాద్ వాసిగా ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం అలాంటిది. మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉందని చెప్పటం నా ఉద్దేశం. అదే విషయాన్ని ఈవెంట్ చివరిలోనూ చెప్పా. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా ఎవరైతే నా మాటల వల్ల మనస్తాపం చెందారో.. వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నిజంగా నా ఉద్దేశం అది కాదు.

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ


నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ‘ఫిదా’ సినిమాను తీశాను. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకు ఎంతో ఆదరణ వచ్చింది. కుటుంబ బంధానికి ఎంత విలువ ఇస్తామో అందులోని భానుమతి పాత్ర ద్వారా చెప్పాము. ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ‘బలగం’ సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మమ్మల్ని ఎంతగానో అభినందించింది. ‘ఇది మా సినిమా’ అని ఇక్కడి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమపై ప్రశంసలు కురిపించాయి. తెలంగాణ వాసిగా ఈ రాష్ట్ర సంస్కృతిని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియడం లేదు.


నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్న వారికి నా క్షమాపణలు.. సినిమా రంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్‌డిసీ ఛైర్మన్‌గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికీ మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సూచనలు చేశారు. ఆ ప్రభుత్వంతో కూడా కలిసి పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమాకు సహకారమందిస్తా. ఎఫ్‌డిసీకి రాజకీయాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను‌’’ అంటూ దిల్‌ రాజు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.


Also Read-Mega Vs Allu: ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు..

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2025 | 04:48 PM