SKN: లోకల్‌ టీవీలో గేమ్‌ ఛేంజర్‌.. మండిపడ్డ నిర్మాత

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:48 PM

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ . ఈ సినిమా విడుదలై వారం రోజులు గడవకముందే ఓ లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేశారు.


రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమా విడుదలై వారం రోజులు గడవకముందే ఓ లోకల్‌ ఛానల్‌లో(Local Tv Chanel) ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఓ  నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అసహనం వ్యక్తంచేశారు. దీనిపై టాలీవుడ్‌ నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కేఎన్‌-SKN) ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. 5 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రాన్ని లోకల్‌ ఓ చానళ్లలో, బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు.. ఇది 4 సంవత్సరాల కృషి. వేలాది మంది కలల ఫలితం. ఇలా లీక్‌ చేేస ముందు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఓసారి ఆలోచించండి ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తాయి. ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం’’ అని పోస్ట్‌ పెట్టారు.  దీనికి #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. 

తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్రబృందం సైబర్‌ క్రేౖమ్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని, రిలీజ్‌ కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రేౖమ్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అలాగే, సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాల పైనా చిత్ర బృందం ఫిర్యాదు చేసింది.  


Updated Date - Jan 16 , 2025 | 12:48 PM