Pic Memory: చేపల ప్రై ప్రేమగా వండారు.. తిట్లతో వడ్డించారు
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:14 PM
చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరి నోట ఆ చేపల రుచి గురించే. ఆ మాటలు విన్న సీనియర్ నటి షావుకారు జానకీ’ అవేంటయ్యా నేను వండిన చేపలు తింటే మీకు తెలుస్తుంది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అంటూ చెప్పుకొచ్చారు
అది 1998వ సంవత్సరం. 'దేవి' (Devi Movie) సినిమా షూటింగ్ హోగెనికల్ వాటర్ ఫాల్స్ సమీపంలో జరుగుతుంది. కోడి రామకృష్ణ (kodi Ramakrishna) ఆ చిత్రానికి దర్శకుడు. ఆ వాటర్ ఫాల్స్‌లో దొరికే చేపల రుచి అద్భుతం. ఆ చేపల్పి పట్టుకుని అక్కడ వండుకుని తింటుంటారు టూరిస్టులు. చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరి నోట ఆ చేపల రుచి గురించే. ఆ మాటలు విన్న సీనియర్ నటి షావుకారు జానకీ’ అవేంటయ్యా నేను వండిన చేపలు తింటే మీకు తెలుస్తుంది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అంటూ చెప్పుకొచ్చారు. అంతే డైరెక్టర్ దర్శకుడు కోడి రామకష్ణ ఎలర్ట్ అయ్యి అప్పుడు జరుగుతున్న సీన్‌లో ఆమె చేపలు వండుతున్నట్లుగా ఎట్మాస్పియర్ క్రియేట్ చేసి షూట్ చేశారు. ఆమె నటిస్తూనే నిజంగానే అద్భుతమైన చేపల ఫ్రై చేసి అందరికీ వడ్డించారు. ఈ విషయం మొత్తాన్ని అప్పట్లో సెట్‌లో ఎట్మాస్మియర్ ఎలా ఉంటుందో గుర్తు చేసుకున్నారు దర్శకుడు దేవి ప్రసాద్. సి. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... (Shavukaru Janaki Fish Fry) .
"హోగెనికల్ వాటర్ ఫాల్స్ సమీపంలో చేపలు పట్టి ఫ్రై చేసిస్తుంటే టూరిస్టులు తింటుంటారక్కడ. అవెంత రుచిగావున్నాయో తిన్న మా యూనిట్ సభ్యులు చెబుతుంటే విన్న సీనియర్ నటీమణి’ షావుకారు జానకి’’గారు ‘‘అవేంటయ్యా నేను వండిన చేపలు తింటే తెలుస్తుంది మీకు అసలు టేస్ట్..అంటూనే సెట్ అందరికీ చేపల ఫ్రై చేసిపెట్టారు. లొట్టలు వేసుకుని తిన్న అందరూ పని ఒత్తిడిలో పడి రుచి ఎలావుందో చెప్పకపోవటంతో ‘కష్టపడి చేసి పెడితే ఎలావుందో కూడా చెప్పరా’’ అని చిరుకోపం వ్యక్తం చేస్తూ ‘‘తల్లికైనా, భార్యకైనా సరే నువ్వు చేసిన వంట బాగుంది అని చెబితే ఆవిడ ఎంత సంతోషిస్తుందో తెలుసా. అందులో మగాడికి పోయేదేముంది’’ అన్నారు. ఆ తరువాత అందరూ ఆమెకు చెప్పాం అనుకోండి. అప్పుడు మేమంతా బ్యాచిలర్స్ కనుక మాకేమేమి ఇష్టమో అడిగి మరీ వారి ఇంటికి పిలిచి స్వయంగా వండి వడ్డించారు’’ అంటూ నాటి గొప్ప నటులు, దర్శకుల గురించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు.
ఆమె నటీమణి అయిన తొలినాళ్ళలో ఆర్థిక పరిస్థితివల్ల ఓరోజు ఆమెకు భోజనంలేక, షూటింగ్‌లో ఆత్మగౌరవంతో ఆ విషయాన్ని ఎవ్వరితోనూ పంచుకోక, కళ్ళు తిరుగుతుంటే అలాగే నటించిన సందర్భం చెప్పినప్పుడు మాకు కళ్ళు చెమ్మగిల్లాయి. అందుకే ఎవరికైన కడుపు నింపడం తనకు సంతృప్తినిస్తుందని ఆమె చెప్పేవారు. మహా అయితే నేనింకో నాలుగయిదేళ్ళువుంటానేమో అప్పటివరకూ నేనే వండిపెడతాను అని ఆనాడు అన్న ఆ మహాతల్లి ఇప్పటికీ 93 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా వున్నారంటే ఆమె స్వచ్ఛమైన మనసు, పదిమందికీ ఆప్యాయతతో కడుపునింపే ప్రేమ తత్వమే కారణం అనుకుంటాను. ప్రతిభలోనూ, మనుషులుగానూ ఆ తరంవారెంత గొప్పవారో అనిపిస్తుంది’’ అని దర్శకుడు దేవి ప్రసాద్ ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు.