RIP Krishnaveni: అలనాటి అందాల 'గొల్లభామ' కృష్ణవేణి కన్నుమూత

ABN , Publish Date - Feb 16 , 2025 | 09:51 AM

తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, నిర్మాత కృష్ణవేణి (Krishnaveni) ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుఝామున 4.00 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం.

తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, నిర్మాత కృష్ణవేణి (Krishnaveni) ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుఝామున 4.00 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం. తొలితరం మహిళలలో నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి.

1924, డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. తండ్రి డాక్టర్ కృష్ణారావు. బాల్యం నుండి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. బాల తారలతో 'అనసూయ' (Anasuya) చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి. పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన 'తులాభారం' (Thulabharam) నాటకాన్ని చూసి టైటిల్ రోల్ కు ఆమెను ఎంపిక చేశారు. అప్పుడు కృష్ణవేణి వయసు పది సంవత్సరాలు. ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్ కత్తాలో జరిగింది. ఈ సినిమాలో దాదాపు 60మంది బాల బాలికలు నటించారు. ఆ తర్వాత తిరిగి రాజమండ్రి వచ్చిన నాటకాలు వేయడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె తండ్రి కన్నుమూశారు. దాంతో తల్లి, చిన్నానల ప్రాపకంలో పెరిగింది. 1937లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నయ్ తీసుకెళ్ళారు. ఆ సమయంలో ఆమె 'తుకారం' సినిమాలో నటించింది. అలా కొన్ని చిత్రాలలో బాట నటిగా రాణించింది.

Krishna-veni-2.jpg

హీరోయిన్ గా తొలి చిత్రం 'కచదేవయాని'

కృష్ణవేణి హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం 'కచదేవయాని' (Kachadevayani) 1938లో వచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాలలో నటించారు. 1939లో 'మహానంద' చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్థ దర్శకనిర్మాత మీర్జాపురం రాజా తో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారి 1940లో వీరు విజయవాడలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం కృష్ణవేణి భర్త కోరిక మేరకు బయటి చిత్రాలలో నటించలేదు. సొంత చిత్రాలలో నటించారు. అలానే తమ శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదే బ్యానర్ లో పలు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సాంఘీక చిత్రం 'జీవనజ్యోతి' ద్వారానే చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు.


కృష్ణవేణి కి గుర్తింపు తెచ్చిన 'లక్ష్మమ్మ, గొల్లభామ'

నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడే కృష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు. విశేషం ఏమంటే ఆమె 'కీలుగుర్రం' (Keelugurram) సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్ పాడారు. కృష్ణవేణి పలు చిత్రాలలో నటించినా... ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు 'లక్ష్మమ్మ, గొల్లభామ'. త్రిపురనేని గోపీచంద్ 'లక్ష్మమ్మ' (Lakshmamma) చిత్రాన్ని మొదట మాలతీతో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్ టేకోవర్ చేసింది. దాంతో అందులో కృష్ణవేణి నాయికగా నటించింది. ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయికగా 'శ్రీ లక్ష్మమ్మ కథ' మొదలైంది. రెండూ పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి. అయితే కృష్ణవేణి నటించిన 'లక్ష్మమ్మ'కే జనం ఓటు వేశారు. ఇక 1947లో వచ్చిన 'గొల్లభామ' నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే... కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని కృష్ణవేణికి ఉండేది. ఆమె 'తిరుగుబాటు' అనే సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు.

aaa.jpg

ఎన్టీఆర్ ను పరిచయం చేసిన కృష్ణవేణి

నటరత్న ఎన్టీఆర్ (NTR) ను వెండితెరకు పరిచయంచేసిన ఖ్యాతి కృష్ణవేణికే దక్కుతుంది. 1942లో కృష్ణవేణి, మీర్జాపురం రాజా దంపతులకు అనూరాధాదేవి జన్మించారు. ఆమె పేరుతో ఎం.ఆర్.ఎ. అనే బ్యానర్ ను స్థాపించి, ఎల్.వి. ప్రసాద్ (L.V. Prasad) దర్శకత్వంలో కృష్ణవేణి 'మనదేశం' (Mana Desam) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. బెంగాలీ భాషలో వచ్చిన 'విప్రదాసు' నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఘంటసాల (Ghantasala), రమేశ్‌ నాయుడు (Ramesh Naidu) లను సంగీత దర్శకులుగా పరిచయం చేసింది, పి. లీల (P. Leela), జిక్కీ లను గాయనీ మణులుగా, ఎర్రా అప్పారావును దర్శకుడిగా జనం ముందుకు తీసుకొచ్చింది కృష్ణవేణే! తొలితరం నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా ఆమె. అప్పట్లోనే 45 వేల పారితోషికం తీసుకున్నారామె. ఆమెతో సరిసమానంగా పారితోషికం తీసుకున్న మరో నటీమణి భానుమతి (Bhanumathi). నటిగా కృష్ణవేణి చివరగా 'సాహసం' సినిమా చేశారు. అలానే నిర్మాతగా ఆమె చివరిచిత్రం 1957లో వచ్చిన 'దాంపత్యం'. ఇందులో హీరోగా కోన ప్రభాకరరావు నటించారు. ఆమె కుమార్తె అనూరాధాదేవి తల్లి అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

2.jpeg

తెలుగు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఇటీవల విజయవాడలో జరిగిన 'మనదేశం' వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు. చక్రాల కుర్చీలోనే విజయవాడకు వెళ్ళిన ఆమెను ఆ వేదికపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. కృష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధృవతార రాలిపోయినట్టయ్యింది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Updated Date - Feb 16 , 2025 | 10:50 AM