Krishnaveni: 101 ఏళ్ళు జీవించిన కృష్ణవేణి ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా...
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:57 AM
నటి, నిర్మాత, గాయని, స్టూడియో అధినేత్రి కృష్ణవేణి (Krishnaveni) తన 101వ సంవత్సరంలో తనువు చాలించారు. తెలుగు సినిమా రంగం (Telugu Film Industry) లో శతవసంతాలను పూర్తి చేసుకున్న నటీనటులు చాలా చాలా అరుదు. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తులు తీసుకున్న కృష్ణవేణి ఈ ఘనతను సాధించారు.
నటి, నిర్మాత, గాయని, స్టూడియో అధినేత్రి కృష్ణవేణి (Krishnaveni) తన 101వ సంవత్సరంలో తనువు చాలించారు. తెలుగు సినిమా రంగం (Telugu Film Industry) లో శతవసంతాలను పూర్తి చేసుకున్న నటీనటులు చాలా చాలా అరుదు. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తులు తీసుకున్న కృష్ణవేణి ఈ ఘనతను సాధించారు. విశేషం ఏమంటే... చివరి వరకూ ఆమె చాలా యాక్టివ్ గా ఉన్నారు. గత యేడాది హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆ వేదికపై ఘనంగా సత్కరించారు. అలానే విజయవాడలో జరిగిన ఎన్టీయార్ 'మన దేశం' (Mana Desam) వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు. ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెట్టడంతో వీల్ ఛెయిర్ లో ఆ వేడుకకు ఆమె హాజరయ్యారు. అక్కడ భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 'మన దేశం' నిర్మాత కృష్ణవేణిని సన్మానించారు.
మార్నింగ్ వాక్, ప్రాణాయామం... (KrishnaVeni Health Secrets)
ఒక సందర్భంలో తన ఆరోగ్య రహస్యం గురించి కృష్ణవేణి మాట్లాడుతూ ఇలా చెప్పారు. ''ఉదయాన్నే అందరిలా కాఫీ తాగడం అలవాటు. గంట తర్వాత పాలల్లో యాపిల్ గుజ్జు, తేనె కలిపి తీసుకుంటాను. ప్రతి రోజూ ఇదే నా బ్రేక్ ఫాస్ట్. మొదటి నుండి పండ్లకే నా ప్రాధాన్యం. ఏవి ఎంత రుచిగా ఉన్నా, కడుపునిండా మాత్రం తినను. మాంసాహారం అరుదుగా తీసుకుంటాను. మధ్యాహ్నం భోజన విషయంలో ప్రత్యేకమైన ఏర్పాటు ఏవీ ఉండవు. ఏది వండితే అదే తింటాను. రాత్రి ఖచ్చితంగా సూప్ తాగుతాను. అందులో టొమాటో సూప్ ఎక్కువ ఇష్టం. దానిలో బ్రెడ్ క్రీమ్ వేసుకుంటాను. నేను తరచూ తాగే జ్యూస్ లలో దానిమ్మ రసం ఒకటి. అందులో చిటికెడు పంచదార, మిరియాల పొడి కలుపుకుంటాను. అప్పుడప్పుడూ మటన్ సూప్, చికెన్ సూప్, బోన్ సూప్ తీసుకుంటాను. ఎనభై యేళ్ళ వయసు వరకూ రోజూ వాకింగ్ చేసే దాన్ని అయితే ఆ తర్వాత ప్రాణాయామం, కపాలభాతి చేసేదాన్ని'' అని అన్నారు.
ఆత్మహత్య వైపు ఆలోచనలు వెళ్ళాయి...
తన ఆరోగ్య రహస్యం గురించి ఆమె వివరిస్తూ, అందులో సంగీతానికీ ప్రాధాన్యముందని తెలిపారు. ఆ వివరాలు చెబుతూ, '' మొదటి నుండి నాకు శాస్త్రీయ సంగీతం అంటే ప్రాణం. కొంతకాలం హిందుస్తానీ గాత్ర సంగీతం నేర్చుకున్నాను. పాటల విషయానికొస్తే, శాస్త్రీయ ఛాయలున్న పాటలంటే ఇష్టం. నేను కథానాయికగా నటించిన సినిమాలన్నింటిలోనూ నా పాటలు నేనే పాడాను. ప్రతి రోజూ ఉదయం బిస్మిల్లాఖాన్ గారి షహనాయి గానీ, రవిశంకర్ సితార్ గానీ తప్పనిసరిగా వింటాను. అవి వింటున్నంత సేపు రాగాలు, నా రక్తనాళాల్లోకి ప్రవహిస్తున్నట్టే అనిపిస్తుంది. ఒక రకంగా నా ఆరోగ్య జీవనంలో సంగీతం పాత్ర కూడా ఉంది. ఇన్నేళ్ళ జీవితంలో ఒడిదుడుకులు, మనసును కల్లోలానికి గురిచేసిన బలమైన సంఘనలు ఎదురయ్యాయి. నా జీవితంలో నన్ను తీవ్రమైన ఆత్మక్షోభకు గురిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ఒకటి రెండు సార్లు మనసు ఆత్మహత్య వైపు ఆలోచింప చేసింది. అవన్నీ సినిమాలకు సంబంధించినవే. కాకపోతే వాటిని తట్టుకుని నిలబడ్డాను. వాటికి ఎదురీది ముందుకు సాగాను. నాకు ఆ ఆత్మ నిబ్బరం, ఆత్మ విశ్వాసం కలగడం వెనుక నా ఆరోగ్యమే ఆలంబన అని చెప్పగలను'' అని అన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అంతగా తీసుకున్నారు కాబట్టి... కృష్ణవేణి శతవర్షాలను సునాయాసంగా దాటేశారనిపిస్తుంది.